ప్రజాశక్తి - వెదురు కుప్పం : చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న మండలాలను నగరి రెవెన్యూ డివిజన్‌లో కలపడంతో ప్రజలు ప్రయోజనాల కన్నా అగచాట్లు ...ఎక్కువగా ఉన్నాయని మండల వాసులు అంటున్నారు. ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా నగరి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చింది. గెజిట్ కూడా విడుదల చేసింది. ఈ నాలుగు మండలాలకు నగరి దూరమని స్థానికులకు అవస్థలు తప్పవని అంటున్నారు. వారి అవస్థలను పాఠకులకు తెలిపే ప్రయత్నంలో 'ప్రజాశక్తి' భాగస్వామ్యమైంది.
కొత్త రెవెన్యూ డివిజన్‌తో అవస్థలు ఇలా.....
ప్రభుత్వం కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుతో అక్కడక్కడ నియోజకవర్గాల్లో పరిధిలోని మండల ప్రజలకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ నియోజక వర్గం తిరుపతికి చిత్తూరుకి మధ్యలో ఉంది. దీంతో అధిక శాతం ప్రజలు దూర ప్రయాణాలతో ఇబ్బంది పడతారు. గతంలో ఈ ఆరు మండలాలు చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగేవి. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన నగరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ పాలసముద్రం, వెదురుకుప్పం, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం ఇచ్చారు. మిగిలిన పెనుమూరు, గంగాధరనెల్లూరు మండలాల మాత్రం చిత్తూరు రెవిన్యూ డివిజన్‌లో కొనసాగుతాయి. వెదురుకుప్పం మండల వాసులు కొత్తగా ఏర్పాటు అయిన నగరి ఆర్డీవోను కలవాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. వెదురుకుప్పం తిరుపతి తుడా పరిధిలో ఉంది. భూములు అప్రూవల్‌కి తిరుపతికి వెళ్ళాలి. కొత్తగా ఏర్పాటు అయిన నగరికి మండల వాసులు ప్రయాణం చేయాలంటే తమ నివాసం నుంచి మండల కేంద్రం పచ్చికాపలం, కార్వేటినగరం, పుత్తూరు మీదుగా చేరుకోవాలి. అక్కడికి చేరుకోవాలంటే బస్సు సౌకర్యాలు కూడా అంతంత మాత్రమే. సాధారణ ప్రజలు అవస్థలు పడుతూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
తిరుపతి అయితే....
తిరుపతికి వెదురుకుప్పం కార్వేటినగరం మండలాలు పక్కపక్కనే అంతా కలిపితే 35 కిలోమీటర్ల లోపే. సామాన్యులు బస్సు ఎక్కి తిరుపతిలో దిగుతారు. తిరుపతి రెవెన్యూ డివిజన్ లో చేర్చి వుంటే చిత్తూరు కన్నా దగ్గరగా ఉండేది. ఇక మిగిలిన శ్రీరంగరాజపురం, పాల సముద్రం, మండలాలను చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లో యధావిధిగా కొనసాగించితే బాగుండేదని స్థానికులు వాదన. ఇదే విషయమై డిప్యూటీ సీఎం నారాయణస్వామికి స్థానికులు విన్నవించారు. ఆయన ప్రణాళిక విభాగ కార్యదర్శి విజయకుమార్‌కు లేఖ కూడా రాశారు. కానీ ఆయన ఆ లేఖను కూడా పై స్థాయి అధికారులకు పంపినట్లు సమాచారం.
వెదురుకుప్పంని తిరుపతిలో కలపాలి

వెదురుకుప్పం తిరుపతి జిల్లాలో కలపాలని గతం నుంచి మండల నాయకులు రైతులతో కలిసి పోరాడుతూనే ఉన్నారని టిడిపి మాజీ జిల్లా కార్యదర్శి మోహన్ మురళి అన్నారు. తిరుపతి రెవిన్యూ డివిజన్‌గా ఉంటే వెదురుకుప్పం వాసులకు అన్నివిధాలా మేలు జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయంపై గంగాధర నెల్లూరు నియోజకవర్గంకి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణ స్వామికి లేఖను అందించాను. అయినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వెదురుకుప్పంని తిరుపతి జిల్లాలో కలపాలని వేడుకుంటున్నాము.
విలీనం అవసరం..

కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడం అన్ని విధాల మేలు. తిరుపతి మా మండల ప్రజలకు అందుబాటులో ఉంది . రైతులు తామ పండించిన పంటను, వ్యాపారస్తులు తిరుపతికి వెళ్లి మార్కెట్లో అమ్ముకుంటారు. అభివద్ధి చెందుతారు .అందరికీ అనుకూలమైనది తిరుపతి జిల్లా. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి అని కార్వేటి నగరం ఎంపీపీ లతా బాలాజీ అన్నారు.
చిత్తూరు డివిజన్లోనే శ్రీరంగరాజపురం

చిత్తూరు రెవిన్యూ డివిజన్లో శ్రీరంగరాజపురం (ఎస్‌ఆర్ పురం) ఉండాలి. కలెక్టర్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, జేఏసీ కార్యాలయం అన్ని చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి. ప్రజలు అవసరాల నిమిత్తం చిత్తూరుకి వెళ్తారు. మండల వాసులు. ఆ కొద్దోగొప్పో పరిజ్ఞానం ఉన్నవాళ్ళు నగరికి వెళ్తారు. మిగతావాళ్లు వెళ్లలేరు వారికి సాధ్యపడని విషయం. అందుకే శ్రీరంగరాజపురం మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లోనే ఉంచాలి అని వైకాపా జిల్లా ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ కుప్పయ్య అన్నారు.










