ప్రజాశక్తి-రాయదుర్గం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రయివేటు పాఠశాలలపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బంగి శివ డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం సెలవు దినం అయినా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వెళ్లి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు సెలవు రోజుల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు. అంతేగాకుండా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు పుస్తకాల పేర ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇవన్నీ స్థానిక మండల విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పటించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాల యాజమాన్యాలు, ఎంఇఒపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రయివేటు పాఠశాల యాజమాన్యంతో వాగ్వివాదం చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ










