శింగనమల : అనంతపురం జిల్లాలో శనివారం వేకువజామున పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుని మంటలు వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోన బస్సు మొత్తం కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తమైన ప్రయాణికులు అందరనీ మంటలు వ్యాపించక ముందే కిందకు దింపేయడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... బెంగుళూరుకు చెందిన ఓవిఆర్ ట్రావెల్స్ ఎపి 39 డబ్ల్యూ 6838 నెంబర్‌గల ప్రయివేటు బస్సు 29 మంది ప్రయాణికులతో శుక్రవారం రాత్రి బెంగుళూరు నుంచి కర్నూలు జిల్లా బనగానపల్లికి బయళ్దేరింది. శనివారం వేకువజామన 3-30 గంటల ప్రాంతంలో బస్సు అనంతపురం- తాడిపత్రి ప్రధాన రహదారిలోని శింగనమల చెరువు వద్దకు రాగానే వెనుకటైర్ పేలింది. వెంటనే డ్రైవర్ బస్సును పక్కన ఆపేశాడు. ఈ సమయంలో చిన్నపాటి నిప్పురవ్వలు టైర్ పేలిన ప్రాంతంలో కన్పించడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యి ప్రయాణికులను బస్సులో నుంచి కిందకు దింపేశాడు. ప్రయాణికులు అలా బస్సు నుంచి కిందకు దిగగానే మంటలు పూర్తిగా వ్యాపించాయి. క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది. ప్రయాణికులు చూస్తుండగానే బస్సు మొత్తం తగలబడిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రమాదం తప్పిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేసి, వేరే వాహనాల్లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు.










