ప్రజాశక్తి-ఉరవకొండ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఆశ్రఫ్ అలీ, త్రిపుల్ ఈ శాఖధిపతి వై.సురేష్‌బాబు పేర్కొన్నారు. గురువారం ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి సహజ అవాసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటారన్నారు. సమాజపు భద్రత, శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ, జల సేవలు అందించే సహకారం గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించి అధ్యయనం చేసేందుకు 1950, మార్చి 23న 180 దేశాల సభ్యత్వంతో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రారంభించింది. ఆ సంస్థ ఏర్పడిన రోజును ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. వాతావరణ శాఖ నిపుణుల ఆధ్వర్యంలో ప్రజల కోసం అవగాహన సమావేశాలు, ఛాయాచిత్ర ప్రదర్శనలు జరుగుతాయన్నారు. వాతావరణ పరిశోధన చేసిన వాళ్లకు ఈ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వాతావరణ సంస్థ బహుమతి, ప్రొఫెసర్ డాక్టర్ విల్హోవైసెల్ అవార్డు, ది నార్బర్ట్ గెర్బియర్ మమ్ అంతార్జాతీయ అవార్డులు అందజేస్తారన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అవగాహన సదస్సులు నిర్వహించుకుంటారని తెలిపారు.










