Sep 17,2023 22:55

పర్యావరణ హితమైన ఆధ్యాత్మికత శ్రేష్టం : ఎమ్మెల్యే
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
పర్యావరణహితమైన ఆధ్యాత్మికత ఎంతో శ్రేష్టమైనదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం సాయంత్రం నగర మేయర్‌ ఎస్‌.అముద, కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణలతో కలిసి పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక అంశాల్లో ప్రకతి సహజత్వానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నగర ప్రజలు పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని నగరప్రజలు సంతోషంగా జరుపుకోవాలని మేయర్‌ ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 500 మట్టి గణపతి విగ్రహాలను నగర ప్రజలకు అందించినట్లు కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు. నగర ప్రజలు మట్టి వినాయకులను పూజించాలని కోరారు. నగరపాలక సంస్థ తలపెట్టిన పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి స్థానిక ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మట్టి విగ్రహాలను తీసుకెళ్లారు.
పక్కాగా ఏర్పాట్లు...
వినాయక నిమజ్జనానికి సంబంధించి కట్టమంచి చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను నగర కమిషనర్‌ అరుణ శనివారం రాత్రి పరిశీలించారు. నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ప్రధానంగా మెరుగైన లైటింగ్‌ వ్యవస్థ ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సిబ్బంది షిఫ్ట్‌ విధానంలో అందుబాటులో ఉండాలని, భక్తులకు తాగునీరు, వైద్య శిబిరం అందుబాటులో ఉంచాలన్నారు. నిమజ్జన సమయంలో తీసుకోవల్సిన చర్యలపై ఇంజనీరింగ్‌, ప్రజారోగ్య విభాగం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఎంఈ గోమతి, ఎంహెచ్‌ఓ డాక్టర్‌ లోకేష్‌, డీఈలు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్‌ పాల్గొన్నారు.