Sep 07,2023 22:03

కాటేజ్‌లను పరిశీలిస్తున్న మాల్‌రెడ్డి

*ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనకు తోడ్పాటు
*పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎల్‌.మాల్‌రెడ్డి
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌:
జిల్లాలో ఎన్నో ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటకశాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎల్‌.మాల్‌రెడ్డి తెలిపారు. గార మండలం శాలిహుండంలోని బౌద్ధారామం, వేణుగోపాల స్వామి ఆలయం వద్ద నిర్మించిన వసతి గదులను పరిశీలించారు. వీటిని త్వరితగతిన పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని ఇంజినీర్లను ఆదేశించారు. టూరిజం రిసార్ట్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. కళింగపట్నం బీచ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళింగపట్నం బీచ్‌ను పర్యాటకులను ఆకట్టుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకులకు అనుగుణంగా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వాటికి సంబంధించి ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. పర్యాటకరంగం వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. పర్యాటకాభివృద్ధితోతో ఆదాయ వనరులు సమకూరడంతో పాటు యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. యువ పర్యాటక క్లబ్‌ల ఏర్పాటు వల్ల పర్యాటక ప్రదేశాలకు విస్తృత ప్రచారం లభిస్తుందన్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి అవకాశాలు శాలిహుండం, కళింగపట్నంలో పర్యాటకుల సంఖ్య వివరాలను జిల్లా పర్యాటక అధికారి ఎన్‌.నారాయణరావును అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు పర్యాటకశాఖ ఇఇ రమణ, డిఇ స్వామి, ఎఇ సీతారాం, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.