ప్రజాశక్తి - పాలకోడేరు
పదో తరగతి తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తరగతలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. మండలంలో కుముదవల్లి, పాలకోడేరు, గరగపర్రు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదో తరగతి తప్పిన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి మోడల్ పేపర్లను అందజేయడం, చదివించడం, చదివింది రాయించడం వంటివి చేయడం ద్వారా ఉత్తీర్ణతకు దోహదపడతాయన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు తక్కువ రోజులు గడువు ఉందని, అలాగే సాంఘిక సంక్షేమం, బిసి సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.వెంకటరమణ, తహశీల్దారు షేక్ హుస్సేన్, ప్రధానో పాద్యాయులు ఉన్నారు.
కలెక్టర్ ప్రశాంతి అసంతృప్తి
పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మహేష్ లేకపోవడం, పదో తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు తరగతులు నిర్వహించకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌ఎం ఎక్కడికి వెళ్లారు, ప్రత్యేక తరగతులు ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఎంతమంది విద్యార్థులు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని డిఇఒను ఆదేశించారు. గరగపర్రు ఉన్నత పాఠశాల వద్ద చెత్త కుప్పలను చూసి పరిశుభ్రతపై ఆరా తీశారు. పాఠశాల ప్రహరీ నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి, ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు.










