ప్రజాశక్తి-అనంతపురం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ సాగుకు అవసరమైన విత్తనాల పంపిణీని వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ సి.హరికిరణ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుంచి వ్యవసాయ శాఖ పథకాలు అమలుపై వీడియో కాన్ఫరెన్‌్‌స నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాగు చేసిన ఖరీఫ్ పంటను ఈక్రాప్ నమోదు వేగవంతం చేయాలన్నారు. పంట నమోదుతోపాటు ఇకెవైసి ప్రక్రియను ఈనెల 30వతేదీలోపు పూర్తి చేయాలన్నారు. అలాగే అక్టోబర్ 5 నుంచి 10వ తేదీ వరకూ రైతు భరోసా కేంద్రాల్లో జాబితాను ప్రదర్శించి గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. 11 నుంచి 14వ తేదీ వరకూ ఫిర్యాదులను పరిశీలించి సరిచేసి 16న ఫైనల్ జాబితా పెట్టాలని సూచించారు. అలాగే క్షేత్రస్థాయిలో సాగు చేసిన ప్రతి పంటనూ పక్కాగా నమోదు చేయాలన్నారు. అక్టోబర్ మాసంలో కిసాన్ డ్రోన్స్ పంపిణీ ఉంటుంది కాబట్టి కిసాన్ డ్రోన్స్ వాటికి పైలట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రతి మండలం నుంచి తప్పనిసరిగా ఒక డ్రోన్ సిహెచ్‌సి గ్రూప్ ఏర్పాటు చేసి ఒక రైతుకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఇకపోతే ఆర్‌బికెల్లో ఎరువులు నిల్వ ఉంచి రైతులకు సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి యు.ఉమామహేశ్వరమ్మ, సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం.రవి, యల్లప్ప, గురుమూర్తి, వెంకటరాముడు, లక్ష్మానాయక్, మండల వ్యవసాయ అధికారులు, జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం సాంకేతిక వ్యవసాయ అధికారులు వెంకటకుమార్, రాకేష్‌నాయక్, బాలనాయక్ తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు










