Oct 06,2023 21:05

ఫొటో : మాట్లాడుతున్న పొగాకు బోర్డు రీజినల్‌ మేనేజర్‌ లక్ష్మణరావు

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని డిసిపల్లి పొగాకు బోర్డులో ప్రత్యామ్నాయ పంటలపై శుక్రవారం పొగాకు బోర్డు రీజినల్‌ మేనేజర్‌ లక్ష్మణరావు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు ధరలు వివిధ దేశాలలో పొగాకు సాగు, దిగుబడి, నాణ్యత, అనేక అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటాయని, పొగాకు ధరలు స్థిరమైన ఆదాయ వనరులుగా పరిగణించరాదన్నారు. పొగాకు పంటను పొగాకు బోర్డు అనుమతించిన విస్తీర్ణం 2.9 హెక్టార్లు ఒక బ్యారెన్‌కి, అనుమతించిన పంట 3650 కేజీలకు ఒక బ్యారెన్‌కు మాత్రమే పండించాలని సూచించారు. పొగాకు పంట పెరగటం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉందని, పొగాకు పంటను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు.
ప్రతి రైతు భూసారాన్ని పెంచుతూ పచ్చరొట్టె ఎరువులు తప్పనిసరిగా పెంచుకోవాలన్నారు. పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలైన కంది, మినుము, శనగ, వంటి పప్పు ధాన్యాలను పండించడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చన్నారు. అంతర్జాతీయంగా పొగాకు పంటకు ఆంక్షలు విధిస్తూ పొగాకు పంటను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలైన చిరు ధాన్యాలు జొన్న, సజ్జ, రాగి, పామాయిల్‌, వేరుశనగ వంటి ధాన్యాలు వేసుకోవచ్చన్నారు. పామాయిల్‌పైన ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుందని తెలియజేశారు. వ్యవసాయ అధికారి రామ్మోహన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి పలు రకాలు పథకలు ఇస్తుందని, వాటిని రైతులు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులును ఆర్‌.బి.కె. ద్వారా సరఫరా చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎస్‌ పొదలకూరు శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు, కె.వి.కె. నెల్లూరు శాస్త్రవేత్త శివజ్యోతి, మండల వ్యవసాయ అధికారి రామ్మోహన్‌, వేలం నిర్వహణ అధికారి జి.రాజశేఖర్‌, పొగాకు బోర్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.