Jul 13,2023 08:48

'వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి- కేరళ ప్రభుత్వ నమూనా' పై అనంతపురంలో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడుతున్న ఎంఎ.బేబి

        అనంతపురం ప్రతినిధ : కేరళ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రత్యేకమైన ప్రణాళికతో వామపక్ష పార్టీలు అభివృద్ధి పథంలో నడిపించాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పరిషత్‌ సమావేశం హాలులో 'వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి- కేరళ ప్రభుత్వ నమూనా' అన్న అంశంపై సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నల్లప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఎ.బేబి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన అంగ్లంలో చేసిన ప్రసంగాన్ని మాజీ ఎమ్మెల్సి డాక్టర్‌ గేయనంద్‌ తెలుగులోకి అనువదించారు. దేశంలో వామపక్ష పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కేరళలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. కేరళ రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాష్ట్రంపై వామపక్ష పార్టీల ప్రభావం ఏ విధంగా ఉంటూ వచ్చిందని వివరించడమే కాకుండా, ఆ ప్రభావం మూలంగా ప్రజలకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతూ వచ్చిందన్నది తెలిపారు. పెట్టుబడిదారీ దేశంలోనే కేరళలో ఏ మేరకు ప్రత్యామ్నయ విధానాలు అవలంభించగలిగారన్నది చెప్పారు. సంపద పున:పంపిణీని కొంత వరకైనా చేపట్టడం ద్వారా వేతనాల్లో ఇతర రాష్ట్రాల్లో కంటే అధికంగా ఉన్నాయన్నది తెలియజేశారు. అందుకే వలస కార్మికులు ఎక్కువగా ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటారన్నారు. విద్యా, ఆరోగ్యానికే కాకుండా గ్రామ స్థాయి నుంచి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం, వాటిని అమలు చేయడం జరుగుతోందన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్నే రద్దు చేసినప్పటికీ కేరళ రాష్ట్రంలో ప్రణాళిక మండలి ఉందని తెలిపారు. ఆర్థికవేత్తలను వైస్‌ ఛైర్మన్‌గా పెట్టి ఈ ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ప్రజలకు అవసరమైన అభివృద్ధి సాధ్యమవుతోందని వివరించారు. స్థానిక సంస్థలకు బడ్జెట్‌లో 35 నుంచి 40 శాతం నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ ప్రణాళిక పైనుంచి కాకుండా దిగువ నుంచి రావడం వాటిని అమలు చేయడం ద్వారా ప్రజలకు అవసరమైన పనులు చేపట్టేందుకు వీలుంటుందన్నారు. అక్షరాస్యతకు పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్టు తెలిపారు. తద్వారా ఈ కాలంలో ఏడు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. ఆంగ్ల విద్య ప్రోత్సహం కోసం ఆరు వేల ఉపాధ్యయ పోస్టులను భర్తీ చేసినట్లు చెప్పారు. సామాజిక భద్రత విషయంలోనూ చర్యలు చేపడుతోందన్నారు. కేరళ రాష్ట్రంలో 85 లక్షల కుటుంబాలుంటే 65 లక్షల కుటుంబాలకు సామాజిక పింఛను సౌకర్యం కల్పిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పేపరు మిల్లు, విమానాశ్రయాలను ప్రయివేటుకు అప్పగించే ప్రయత్నం కేంద్రం చేస్తే, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి బాటలో పయనింపజేస్తోందని గుర్తు చేశారు. కేరళ రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఎక్కువనే చెప్పారు. ప్రధానంగా యువత కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. కోవిడ్‌ సమయంలో వారు చేసిన సేవలు అమోఘమన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే క్షేత్ర స్థాయి నుంచి ప్రణాళికలు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలపై ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుందని సూచించారు. భూ పంపిణీని చేపట్టాల్సి ఉందన్నారు. కేరళలో ముందు నుంచి వస్తున్న వామపక్ష ప్రభుత్వాలు వీటి అమలుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ముందుకుపోతుండటంతోనే మానవాభివృద్ధి సూచికల్లోనూ కేరళ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, సావిత్రి, నగర కార్యదర్శి వి.రామిరెడ్డి, మానవ హక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్‌, ఎస్‌ఎం.బాషాతో మేధావులు, పురప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు.