ప్రజాశక్తి - కుప్పం : ప్రతి విద్యార్థి భవిష్యత్తు జగనన్న బాధ్యతని చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ అన్నారు. గురువారం అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా స్థానిక బాలల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్సీ భరత్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ.... ప్రతి విద్యార్థి పాఠశాలలో చదువుకోవాలన్న మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతిఏటా విద్యార్థినీ, విద్యార్థుల తల్లి బ్యాంక్ అకౌంట్లో నగదు వేస్తున్నారని అన్నారు. దీని ద్వారా డ్రాపవుట్ విద్యార్థులు సైతం పాఠశాలలకు వస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి లబ్ధిదారులకు అమ్మబడి ఓ వరంలా మారిందన్నారు. రాష్ట్రంలో విద్యపై ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్‌కు నేనున్నా అంటూ భరోసా కల్పించిన ఏకైక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ అర్హులైన పేద ప్రజలకు నవరత్నాలు అందుతున్నాయన్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారునికి పథకాలు అందడంతో ప్రజల హదయాలల్లో ముఖ్యమంత్రి శాశ్వతంగా నిలిచారాని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్మన్ డా..సుధీర్, మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్, ఎంపీపీ అశ్విని, మండల కన్వీనర్ మురుగేష్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్‌లు, సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.










