ప్రజాశక్తి -అనంతపురం ప్రతి ఇంటికీ వెళ్లి లబ్ధిదారునితో మమేకమవుతామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అందుకే 'జగనన్నే మా భవిష్యత్' అని జనం అంటున్నారని చెప్పారు. శుక్రవారం నగరంలోని నవోదయ కాలనీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో కలిసి పలు కుటుంబాలను నేరుగా కలిశారు. చంద్రబాబు పాలనకు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు తేడాను వివరించి ప్రజల మద్దతు కోరారు. భవిష్యత్‌లోనూ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ఉంటారా? సంక్షేమ పథకాలు అందుతున్న తీరు బాగుందా? ఇంకా ఏమైనా మార్పు చేయాలా? అని ప్రజల అభిప్రాయం తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 60 లక్షల కుటుంబాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు కలవడమే లక్ష్యంగా 'జగనన్నే మా భవిష్యత్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈనెల 20వ తేదీ వరకు దాదాపు 14 రోజులు ప్రజలతో మమేకమవుతామన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నాలుగేళ్లలో రూ.2 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందజేసిన ఘనత సిఎం జగన్‌మోహన్‌రెడ్డిదే అన్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేదని చెప్పారు. జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి క్లస్టర్ పరిధిలో రోజూ 10 నుంచి 15 కుటుంబాలను కలిసి ప్రజామద్దతు కోరనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రజల సమ్మతితో ప్రతి ఇంటికీ స్టిక్లర్లు అందిస్తామన్నారు. వైసీపి జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య మాట్లాడుతూ పేదలకు ఏదైనా మంచి జరిగిందంటే అది జగన్ సీఎం అయిన తర్వాతేనని చెప్పారు. భవిష్యత్తులో ఇంకా మంచి జరగాలంటే వైసిపితోనే సాధ్యమన్నారు. అనంతరం జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.










