Jul 21,2022 23:15

సమావేశంలో కలెక్టర్‌

ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌
ఆజాదీ కా అమత్‌ మహౌత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం ఆగస్టు ఒకటి నుంచి 15 వరకు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, పర్యాటక, సాంస్కతిక శాఖల ప్రత్యేక కార్యదర్శి రజిథ్‌ భార్గవ అన్నారు. గురువారం రాజధాని నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ను జిల్లా కలెక్టర్లతో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను రూపొందించింది. ఇందులో భాగంగా ఆగస్టు ఒకటి నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని భావించింది. ఈ కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజలను చైతన్యపరిచి దేశభక్తిని పెంపొందించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి వీధి, ఇళ్లపై జాతీయ జెండా రెపరెపలాడాలని మూడు రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తగిన ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రాముఖ్యత గల ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాల గొప్పతనం గురించి వివరిస్తూ వివిధ రకాలుగా ప్రచారం కల్పించాలని స్వాతంత్ర సమరయోధులు ఆయా గ్రామ పట్టణాలలో ఉన్న ప్రముఖులచే ర్యాలీలు నిర్వహించాలని ఇందులో భాగంగా ఆగస్టు రెండున మన దేశ జాతీయ జెండా రూపశిల్పి అయిన పింగళి వెంకయ్య జన్మదినం సందర్భంగా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆగస్టు 13 ,14 ,15 తేదీలలో ప్రతి ఇంటి, వీధిలలో మూడు రోజులపాటు జాతీయ జెండా రెపరెపలాడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ పాల్గొన్నారు.