
* శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - ఆమదాలవలస, పొందూరు: ప్రతి గడపకూ తాగునీరు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలస మండలంలోని వెదుళ్లవలస, కట్యాచార్యులపేటలో సుమారు రూ.81.64 లక్షలతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయిల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. పొందూరు మండలం సింగూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అందజేసిన సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో మహిళలు మంచినీటి కోసం పడుతున్న ఇక్కట్లను చూసి చలించి గ్రామాల్లోని మహిళలకు తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. నియోజకవర్గంలో సింహ భాగం జల్ జీవన్ మిషన్ పనులను చేపట్టినట్లు తెలిపారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. 98 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సిఎం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పొందూరు జెడ్‌పిటిసి లోలుగు కాంతారావు, ఎంపిపి ప్రతినిధి కిల్లి నాగేశ్వరరావు, ఆమదాలవలస ఎంపిడిఒ ఎస్.వాసుదేవరావు, వైసిపి పొందూరు మండల అధ్యక్షులు పప్పల రమేష్ కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, సర్పంచ్‌లు సురేష్, ఎన్ని రామచంద్రరావు, చంద్రమణి, మెట్ట శ్యామలరావు, అధికారులు పాల్గొన్నారు.