ప్రసూతి మరణాలు జరగకుండా చర్యలు : కలెక్టర్
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో సమూల మార్పులు తెస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తోందని కలెక్టర్ యం. హరి నారాయణన్ తెలిపారు. శనివారం జిల్లా సచివాలయం లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో 2022 ఏప్రిల్ నుండి 2022 నవంబర్ వరకు జరిగిన ప్రసూతి మరణాలకు సంబంధించి సంబంధిత మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తోందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ అంశం పై మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎం లు, ఆశా, అంగన్వాడీ వర్కర్లు అందరూ సమన్వయంతో పని చేసి జిల్లాలో ప్రసూతి మరణాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా క్షేత్ర స్థాయిలో గర్భిణీలకు అందించే వైద్య సేవల్లో ఏఎన్‌ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్ ప్రధాన పాత్ర పోషిస్తారని, వీరు గర్భవతుల ఆరోగ్య స్థితుల పై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ వారికి అవసరమైన వైద్య సలహాలు, సూచనలు ఇవ్వాలని, వారు సుఖ ప్రసవం జరిగేలా, తల్లి, బిడ్డ క్షేమంగా ఇంటికి చేరుకునేంత వరకు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. గర్భవతులుగా ఉన్న సమయంలో వారికి అవసరమైన పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడంతో పాటు రక్త హీనత లేకుండా సుఖ ప్రసవం జరిగేలా తీసుకోవలసిన జాగ్రత్తల పై తగు అవగాహనను ఏ ఎన్ ఎం లు కల్పించాలని, అందుకు అవసరమైన మందులను అందజేయాలని తెలిపారు. హైరిస్క్ గర్భవతుల పై మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్య సేవల నిమిత్తం వచ్చే గర్భవతులకు ప్రసవ సమయంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదరైనప్పుడు మెరుగైన వైద్య సేవల కొరకు సరియైన వైద్యశాలకు వెంటనే సిఫారసు చేసి పంపాలని తద్వారా తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో మెటర్నల్ మొర్టాలిటి రేషియో (ఎంఎంఆర్) 35.5గా కలదని, ఇన్ఫాంట్ మొర్టాలిటి రేట్ 7.5 గా కలదని, డి సి హెచ్ ఎస్ డా. నాయక్ కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశం లో డి ఐ ఓ డా. రవి రాజు, సంబంధిత మెడికల్ ఆఫీసర్ లు పాల్గొనగా, ప్రసూతి మరణాలకు సంబంధించిన వివరాలను కేసుల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.










