అనంతపురం కలెక్టరేట్ : సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించిన విద్యార్థులను సెంట్రల్ యూనివర్శిటీ యాజమాన్యం సస్పెండ్ చేయడం అన్యాయంగా ఉందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతురు పరమేష్ పేర్కొన్నారు. విద్యార్థుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థుల సస్పెన్షన్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా పరమేష్ మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీకి జంతులూరు దగ్గర కేటాయించిన స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించలేని స్థితిలో బిజెపి ప్రభుత్వం ఉందన్నారు. విద్యార్థులు ఇప్పటికీ అద్దె భవనంలో ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో ఏర్పడిందన్నారు. ఇక్కడ 21 రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. మంచినీరు, మంచి భోజనం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో యూనివర్సిటీ అధికారులు, బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులు తినేటువంటి భోజనంలో అనేకసార్లు పురుగులు రావడం అదే విధంగా కనీసం మంచినీరు లేకపోవడం టాయిలెట్ సదుపాయం కూడా లేదన్నారు. ఈ సమస్యలపై అనేక సార్లు విసి, వర్శిటీ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి పోరాటాలు చేసిన ఏమాత్రం స్పందించని దుస్థితి నెలకొందన్నారు. యూనివర్సిటీ సంబంధించినటువంటి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్‌లలో అనేకమైన సమస్యలు ఉన్నాయని విసి చెప్పినప్పటికీ విసి స్పందించడం లేదన్నారు. కంట్రోల్ ఆఫ్ ఎగ్జాంమినర్ చేసినటువంటి తప్పుల వల్ల అనేక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. యూనివర్సిటీలో జరిగే అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించే విద్యార్థులను ఉద్దేశ్య పూర్వకంగా సస్పెండ్ చేయడం దౌర్భాగ్యం అన్నారు. ఈ దుర్మార్గమైన విధానాలను యాజమన్యం మానుకోవాలని, విద్యార్థులను సస్పెన్షన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలక్రిష్ణ, నరసింహారెడ్డి, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బాలు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గిరి, గౌసియా, రజిత, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కిరణ్, వినోద్, చంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు.










