
* ఎస్‌పి జి.ఆర్ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: శ్రీకాకుళం నగర పరిధిలోని వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్‌పి జి.ఆర్ రాధిక అధికారులను ఆదేశించారు. నగరంలో నాగావళి నది ప్రవహించే డే అండ్ నైట్, పాతబ్రిడ్జి, పొన్నాడ వంతెన ఇరువైపులా నిమజ్జనం ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. నిమజ్జన ప్రదేశాల వద్ద ఎటువంటి అపశ్రుతులు దొర్లకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎత్తయిన విగ్రహాలను పొన్నాడ వంతెన వద్ద నిమజ్జనం చేయాలని సూచించారు. నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే నదిలోకి ప్రవేశించకుండా క్రేన్ల సహాయంతో విగ్రహాలు నిమజ్జనం చేయాలన్నారు. అన్నిచోట్లా అవసరమైన సిబ్బందిని కేటాయించి, నిమజ్జన ప్రాంతంలో నగరపాలక సంస్థ, రెవెన్యూ, విద్యుత్, అగ్నిమాపక శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. సిసి కెమెరాలు, లైటింగ్ వెలుతురులో నిమజ్జనం చేయాలన్నారు. ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని... నిమజ్జనం ప్రాంతంలో పిల్లలు, వృద్ధులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిఘా ఉంచాలన్నారు. శోభాయాత్ర జరిగే రహదారులు, కూడళ్ల వద్ద పటిష్ట బందోబస్తుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిర్దేశిత సమయాల్లోనే నిమజ్జనాలు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు. లైఫ్ జాకెట్లు, నాటు పడవలు తదితర వాటిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్‌పి వెంట డిఎస్‌పి వై.శృతి, సిఐ పి.శ్రీనివాసరావు, ఎల్.ఎస్ నాయడు, ఎస్‌ఐ గణేష్, లక్ష్మణరావు ఉన్నారు.