Jul 16,2023 21:27

ప్రజాశక్తి - కాళ్ల
ప్రతి పల్లెలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌. నరసింహరాజు అన్నారు. దొడ్డనపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆదివారం నిర్వహించారు. జల జీవన్‌ మిషన్‌ ద్వారా రూ.66 లక్షలతో కచ్ఛా గరువు, డ్రెయిన్‌ పక్కన ప్రాంతాల్లో రెండు వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జెడ్‌పిటిసి నిధులు రూ.5 లక్షలు, ఎంపిపి నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన సిమెంట్‌ రోడ్లను పివిఎల్‌ నరసింహరాజు ప్రారంభించి మాట్లాడారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి పాలనలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే ఉద్దేశంతో జల జీవన్‌ మిషన్‌లో ప్రతి గ్రామంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. జల జీవన్‌ మిషన్‌ ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా చేపడుతున్నామన్నారు. అభివృద్ధిలో పార్టీలు ఉండవని, అందరూ సమిష్టిగా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. రాబోయే రోజుల్లో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాల్సి ఉందన్నారు. దొడ్డనపూడి గ్రామానికి కోటీ పది లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కొల్లి సుబ్బారావు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి శ్రీనివాసరాజు (వాసు), ఎంపిటిసి కాశీ, సత్యనారాయణ, వైసిపి గ్రామ అధ్యక్షులు గుండా సాయి బాబా, వైసిపి నాయకులు పాల్గొన్నారు.