ప్రొబేషన్‌పై ఉత్కంఠ..!
జూలై నుంచి కొత్త పే స్కేళ్లు
ఆగస్టు నుంచి పెరిగిన వేతనాలు అమలు
ఒకటి రెండు రోజుల్లో జీఓకు అవకాశం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. జూన్‌కే వచ్చేస్తుందని ఆశగా ఎదురు చూశారు. అయితే 15 అవుతున్నా ఇప్పటివరకు లేకుండా పోయింది. కాగా ఈ ఫైలుకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంతకాలు పెట్టారు. దీంతో ఈనెలాఖరు నాటికి అన్నీ పూర్తయ్యి జూలై ఒకటి నుంచి కొత్త పేస్కేళ్లు రానున్నాయి. ఆగస్టు నాటికి కొత్త వేతనాలు సచివాలయ ఉద్యోగులకు రానున్నాయి. 74 శాతం మందికి ప్రొబేషన్ డిక్లర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై సచివాలయాల ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
వైసిపి అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున సచివాలయాలను తీసుకొచ్చిన విషయం విధితమే. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సచివాయాలను ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 1360 సచివాలయాలను ఏర్పాటు చేశారు. అలాగే నగర, పురపాలికసంస్థల్లో వార్డు వారిగా వార్డు సచివాయలను కూడా స్థాపించారు. ఇలా ఏర్పాటు చేయడంపై వైసిపి మైలేజీ బాగా పెరిగినట్లు అయ్యింది. ఎన్నడూ లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం, వాటిల్లో ఒక్కోదానికి పది మంది చొప్పున ఉద్యోగులను ఏర్పాటు చేశారు. అదీ శాఖలవారీగా విభజించి వారిని ఎంపిక చేయడంపై సర్వత్రా ప్రసంశలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పట్టణాల్లో, గ్రామాల్లో వాలంటీర్లను ఏర్పాటు చేయడం కూడా అందరి మన్ననలు పొందాయి. ఇలా 2019 అక్టోబర్ రెండో తేదీ నుంచి ఈ వ్యవస్థ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 11,969 మంది ఉద్యోగులను ఇందులో శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేశారు. ఇందులో 10319 మంది ప్రస్తుతం ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. వివిధ కారణాల వల్ల 1650 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరందరినీ 2021 అక్టోబర్ ఐదోతేదీ నాటికి పర్మినెంటు చేసుండాలి. ఇప్పటికీ రూ.15వేల వేతనంతోనే వీరు పనిచేస్తున్నారు. వారిని పర్మినెంటు చేసుంటే 2022లో పిఆర్‌సి ప్రకారం వీరికి వేతనాలు వచ్చేవి.
7646 మందికి ప్రొబేషన్ డిక్లర్
ఇటీవల సచివాలయ ఉద్యోగులకు అందరికీ డిపార్టుమెంటు పరీక్షలు నిర్వహించింది. ఇందులో 74శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. 7646 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో గ్రామ సచివాయాల్లో పనిచేసే వారు 6712 మంది, వార్డుసచివాయాల్లో పనిచేసే 934మంది ప్రొబేషన్‌కు అర్హత సాధించారు. ఈమేరకు ఆయా శాఖలవారీగా అధికారులు జాబితాలను సిద్ధం చేశారు. దీన్ని కలెక్టర్ వద్ద ఉంచారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఈ ఫైలుపైన గురువారం నాడు సంతకాలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో జీవో కూడా వస్తుందని, జూలై ఒకటో తేదీ నుంచి పిఆర్‌సి ప్రకారం వీరికి వేతన స్కేళ్లు వర్తించనున్నాయి. ఆగస్టు నుంచి పెంచిన వేతనాలు అందనున్నాయి.










