Jun 15,2023 17:17

ప్రజాశక్తి - తణుకు రూరల్‌
మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌కు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా మునిస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో మున్సిపాల్టీల్లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు సుమారు 40,000 మంది ఉన్నారని, వారందరినీ పర్మినెంట్‌ చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో వాగ్దానం చేశారని తెలిపారు. ప్రభుత్వం వచ్చి సుమారు నాలుగున్నర సంవత్సరాలైనా కార్మికులను పర్మినెంట్‌ చేయకుండా, కనీస వేతనం ఇవ్వకుండా వేధిస్తున్నారని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దేశ ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన దాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 జీతం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా దాన్ని అమలు చేయలేదన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ మాట్లాడుతూ ఆరోగ్యాలు సరిగ్గా లేకపోయినా మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, వారందరినీ పర్మినెంట్‌ చేసే వరకూ కార్మికులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు నీలాపు ఆదినారాయణ బాబు, కొత్తపల్లి అయ్యప్ప, కె.నవీన్‌, ఎంటివి.గణేష్‌, కె.అమ్ములు, ఇ.దుర్గాప్రసాద్‌, కె.సత్యనారాయణ, ఎస్‌.పద్మ, శ్రీరాములు పాల్గొన్నారు.