Jul 23,2023 21:22

భయాందోళలో ప్రజలు
ప్రజాశక్తి - ఆకివీడు

               మండలంలోని కొల్లేరు గ్రామం రాజులపేట. ఈ గ్రామానికి శివారు దళితవాడ కొత్తచెరువు ప్రాంతం. ఈ శివారు ప్రాంతానికి వెళ్లాలంటే ఉన్న ఏకైక మార్గం చినకాపవరం నుంచి కొల్లేరులోకి వెళ్లే పాత వయ్యేరు కాలువ పైన ఆ గ్రామం మొదట్లో నిర్మించిన ఫుట్‌ పాత్‌ వంతెన ప్రధాన మార్గం. సుమారు రెండు దశాబ్దాల క్రితం గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఫలితంగా ఆ వంతెనను నిర్మించారు. వంతెన మోటార్‌ సైకిల్‌, నడకవారికి మాత్రమే ఉపయోగిస్తుంది. గ్రామంలోకి ఆటో వెళ్లాలన్నా, కనీసం అంబులెన్స్‌ వెళ్లాలన్నా కూడా ఒకప్పుడు మార్గంలేని పరిస్థితి. అయితే ఇప్పుడు చిన్నమిల్లిపాడు నుంచి చుట్టూ తిరిగి వెళ్లే రోడ్డు నిర్మించడంతో రెండున్నరకు పైగా కిలోమీటర్లు చుట్టూ తిరిగి ఆ గ్రామంలోకి వెళ్లే అవకాశం వచ్చింది. అది కూడా పూర్తిస్థాయి రోడ్డు కాదు. కాలువ గట్టు కంకర రోడ్డు మాత్రమే. కాలింగ్‌గూడెం గ్రామస్తులు వేసుకున్న పంచాయతీ రోడ్డు. వర్షాకాలం అయితే ఆ రోడ్డు కూడా అంతంత మాత్రమే. కంకర కూడా పూర్తిస్థాయిలో పోయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ రోడ్డు ప్రత్యామ్నాయ మార్గమే తప్ప ప్రధాన రహదారి మాత్రం ఫుట్‌ పాత్‌ వంతెన మాత్రమే. కాని ఆ వంతెనకు రైలింగ్‌ విరిగిపోయింది. ఎప్పుడు ఎవరు ఏ పక్కకి పడిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. నడిచి వెళ్లినా సైకిల్‌ మీద వెళ్లినా కూడా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ ఒక్క రోడ్డు తప్ప వేరే మార్గం లేదు. కాలింగ్‌గూడెం రోడ్డు కూడా బురద మాయంగా మారడంతో ఇదే ఏకైక మార్గమైంది. ఎప్పుడు ఏ వాహనం కాల్వలో పడిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వంతెనను వెడల్పు పెంచి కొత్త వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.