Nov 14,2022 23:47

పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ శాఖలు ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి మురళీకష్ణ

ప్రకృతి వ్యవసాయంపై మొగ్గుచూపాలి
డిఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కరుణకుమార్‌

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: వ్యవసాయరంగంలో అనేక మార్పులు వచ్చాయని, వాటిని ఉపయోగించుకోవాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్‌ సివిల్‌జడ్జి డాక్టర్‌ ఐ.కరుణ కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక వ్యవసాయశాఖ అధికారి కార్యాలయం ఆవరణలో వ్యవసాయ, అనుబంధ శాఖలు పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ శాఖలు ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జిల్లా వ్యవసాయ అధికారి మురళీకష్ణ, పశుసంవర్ధక శాఖ జెడి వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. అనంతరం వ్యవసాయశాఖ కార్యాలయంలో సమావేశం నందు రైతులు, రైతు కూలీలకు చట్టాల గురించి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇజ్రాయిల్‌ టెక్నాలజీని ఉపయోగించుకోవడ వల్ల తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడును వస్తాని తెలిపారు. ప్రభుత్వం అందించే అనేక సంక్షేమ పథకాలను రైతుల ఉపయోగించుకోవాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు వ్యవసాయానికి సంబంధించిన సూచనలు సలహాలను పాటించాలని, ప్రకతి వ్యవసాయంపై మొగ్గు చూపాలన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకష్ణ, మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని వాటిని ఉపయోగించుకోవాలన్నారు. రాయితీపై ఎరువులు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు అందజేస్తుందని, రైతు భరోసా ద్వారా సంవత్సరానికి రూ.13,500లు అందజేస్తుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయానికి సంబంధించి ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ప్రస్తుతం నగిరి నియోజకవర్గంలో ఒక ల్యాబ్‌ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలో రోజుకు 10 లక్షల నుండి 20 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, వ్యవసాయంతో పాటు పశుసంపద పైన కూడా రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.