Nov 04,2022 22:37

ప్రకృతి వ్యవసాయంలో అగ్రగామి కావాలి : టిటిడి ఈవో

ప్రకృతి వ్యవసాయంలో అగ్రగామి కావాలి : టిటిడి ఈవో
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో

ప్రకృతి వ్యవసాయంతో భూసారాన్ని పెంచడమే గాకుండా, రాష్ట్రంలో నంబర్‌ వన్‌గా అగ్రగామిగా నిలవాలని ప్రకృతి వ్యవసాయంలో అగ్రగామి కావాలి : టిటిడి ఈవోఅన్నారు. శ్వేతలో 24 జిల్లాల నుండి విచ్చేసిన ప్రకృతి వ్యవసాయ రైతులతో ఆత్మీయ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గతేడాది అక్టోబర్‌లో ముఖ్యమంత్రివర్యులు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసినపుడు వారి సమక్షంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌తో టిటిడి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి గో ఆధారిత ప్రకతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించేందుకు రైతు సాధికార సంస్థ గుర్తించిన రైతుల నుండి మార్క్‌ఫెడ్‌ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి టిటిడికి అందించాలని, తద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు గతేడాది మొదటి విడతగా ప్రకతి వ్యవసాయం ద్వారా పండించిన 2500 టన్నుల శనగలను కొనుగోలు చేశమన్నారు. వీటిని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఐటిసి ప్రయోగశాలలో పరీక్షించగా ఎలాంటి రసాయన అవశేషాలు లేనట్టు గుర్తించారని తెలిపారు. ఈ ఏడాది మరో 12 రకాల ఉత్పత్తులు కలిపి దాదాపు 16 వేల టన్నులు సేకరించాలని టిటిడి బోర్డు నిర్ణయించిందని, ఈ మేరకు రైతు సాధికార సంస్థకు లేఖ ద్వారా తెలియజేశామని చెప్పారు. రానున్న కాలంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడికి అవసరమైన అన్ని వంట సరుకులను ప్రకతి వ్యవసాయం ద్వారా పండించినవే కొనుగోలు చేస్తామన్నారు. రైతు సాధికార సంస్థ వైస్‌ ఛైర్మన్‌ విజయకుమార్‌, మార్క్‌ఫెడ్‌ ఎండి పిఎస్‌.ప్రద్యుమ్న మాట్లాడుతూ ప్రకతి వ్యవసాయ రైతులు దళారుల కారణంగా నష్టపోకుండా మార్క్‌ఫెడ్‌ పూర్తి పారదర్శకంగా వారి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి త్వరితగతిన సొమ్ము చెల్లిస్తున్నట్టు తెలిపారు. సిఎం యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రకతి వ్యవసాయ రైతులతో లావాదేవీలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా మంచి దిగుబడులు సాధించిన రైతులను టిటిడి ఈవో ఇతర అధికారులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో సదా భార్గవి, రైతు సాధికార సంస్థ సిఈవో రామారావు, టిటిడి మార్కెటింగ్‌ జిఎం సుబ్రహ్మణ్యం, సిఎస్‌ఏ రీజనల్‌ కౌన్సిల్‌ చంద్రకళ, ఐటిసి ల్యాబ్‌ శాస్త్రవేత్త డా.కె.సత్యనారాయణమూర్తి, శ్వేత డైరెక్టర్‌ ప్రశాంతి, డెప్యూటీ ఈవో పద్మావతి పాల్గొన్నారు