ప్రకృతి వ్యవసాయాన్ని పెంచుద్దాం..
జిల్లా పరిషత్ సిఇఒ ప్రభాకర్‌రెడ్డి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
క్షేత్రస్థాయిలో ఆర్గానిక్ వ్యవసాయం చేయడం వల్ల కలిగే లాభాలను ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న సర్పంచులకు అవగాహన కల్పించగలరని శిక్షణాశిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారి పి.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం సర్పంచులకు నిర్వహించారు. ఈసందర్భంగా సీఈవో మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే రసాయన ఎరువులు ఉన్న పంటలు కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతులతో పండిన పంటలను తినడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటామని అన్నారు. ఇప్పటికే రెండుచోట్ల శిక్షణను మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఈకార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈకార్యక్రమానికి సంబంధించి టిటిడి వారు కూడా చేయూతనిస్తున్నారని తెలిపారు. జిల్లాలో 502 రైతు భరోసా కేంద్రాలు ఉండగా 162 రైతు భరోసా కేంద్రాలలో ఈ వ్యవసాయం చేయడం జరుగుతుందని, ఇప్పటికే 140 కేంద్రాలకు దేశవాళి ఆవులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ఒకసారి రసాయనిక ఎరువులు వాడడం వల్ల మరో పంటపెట్టాలంటే మోతాదుకు మించి వాడాల్సి వస్తుందని దీనివల్ల వ్యవసాయక్షేత్రాలు నిస్సారంగా మారిపోతాయని తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం కార్యదర్శి షణ్మగరామ్ మాట్లాడుతూ ప్రభుత్వం స్వచ్ఛభారత్ కింద సంపద నుంచి ఎరువులు తయారు చేయడం జరుగుతుందని ఈ ఎరువులు ఉపయోగించడం వల్ల ఎవరికీ ఎటువంటి నష్టంఉండదని వీలైనంతవరకూ ఎరువులను అధికంగా ఉత్పత్తి చేయాలన్నారు. వ్యవసాయ అధికారి వాసు మాట్లాడుతూ 1965లో ఆహార ఉత్పత్తుల కొరత రావడంతో కత్రిమ ఎరువుల వినియోగం మొదలైందని అయితే ఇటీవల కాలంలో ఆరోగ్యానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని తిరిగి తీసుకురావడం జరిగిందని అన్నారు.
స్థానికులతో కలిసి ముందుకు అడుగువేస్తాం
- వీణ, సర్పంచ్, మోర్తానపల్లి
రాష్ట్ర ప్రభుత్వం సేంద్రీయవ్యవసాయ విధానాన్ని అవలంభించాలని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు అయ్యేందుకు మాకు అవగాహన కల్పించడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న సేంద్రీయ వ్యవసాయ విధానం పద్ధతులను క్షేత్రస్థాయిలో పదిమందికి తెలియజేసి మరింతగా ఈ వ్యవసాయాన్ని అభివద్ధి చేసే విధంగా స్థానికులతో కలిసి ముందుకు అడుగు వేస్తాం.
ప్రజల ఆరోగ్యానికి మరింతగా తోడ్పడతాం
- ఇబ్రహీం ఖాన్,
సర్పంచ్ రొంపిచర్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో ఆనందకరంగా ఉంది. ఇందులో సేంద్రీయ వ్యవసాయ విధానం ద్వారా వ్యవసాయం చేయడం మా గ్రామంలో కొంతమంది చేపట్టడం జరిగింది. మరింత ఎక్కువమందికి ఈశిక్షణ ద్వారా ఉన్న అనుభవాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. దీని ద్వారా వ్యవసాయ విధానంలో మార్పులు తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యానికి మరింతగా తోడ్పడతాం.










