Nov 04,2022 22:29

ఉన్నత విద్యనభ్యసించి పొలంబాట

ప్రకృతి సేద్యం.. 'పట్టభద్రుల' విజయం
సేంద్రియ వ్యవసాయంతో లాభాలు
ఉన్నత విద్యనభ్యసించి పొలంబాట
ఆదర్శ దంపతులు శ్రీవాణి, విజయులు
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్‌
ప్రకతి వ్యవసాయాన్నే నమ్ముకున్నారు.. అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నారు పట్టభద్రులైన ఆ దంపతులు. ప్రైవేటు ఉద్యోగాలు వదిలి ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి పెంచుకొని మంచి పట్టు సాధించారు. ఉన్నత చదువులు చదివి పదిమందికి ఆరోగ్యం పంచాలనే దఢ సంకల్పంతో వారికున్న రెండెకరాల్లోనే సేంద్రియ వ్యవసాయంతో వివిధ రకాల కూరగాయలను పండిస్తున్నారు. తన పొలాన్నే ఓ పాఠశాలగా మార్చి రైతులకు ప్రకతి వ్యవసాయంపై శిక్షణ సైతం అందిస్తున్నారు. ప్రజారోగ్యం కోసం నిరంతరం తపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు పుత్తూరు మండలం సిరుగురాజుపాళెం పంచాయతీ దిగువ గూళూరుకు చెందిన శ్రీవాణి, విజయులు.
పుత్తూరు మండలంలోని సిరుగురాజుపాళెం పంచాయతీ దిగువగూళూరు గ్రామానికి చెందిన దంపతులు శ్రీవాణి, విజయులు ఇద్దరూ డిగ్రీ పట్ట భద్రులు. శ్రీవాణి బీఎస్సీ, బీఎడ్‌. విజయులు బీకాం, బీఎడ్‌ చేశారు. వీరికి 15 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఉపాధ్యాయులుగా స్థిరపడాలనుకుని విద్యావాలంటీర్లుగా, ప్రైవేటు ఉపాధ్యాయు లుగా వత్తిని కొనసాగించారు. వీరు ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో ప్రకతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ పొందారు. దీంతో 2012 నుంచి వ్యవసాయం చేయడానికి దంపతులిద్దరూ పూనుకున్నారు. వారికున్న రెండు ఎకరాల పొలంలో అప్పటివరకు రసాయనిక ఎరువులతో వరి, వేరుశనగ సాగుచేసేవారు. అవగాహన లోపంతో రైతులు విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వినియోగిస్తూ అప్పుల పాలవుతున్న వైనాన్ని గమనించారు. ప్రకతి వ్యవసాయం చేయడానికి అవసరమైన సేంద్రియ ఎరువులను వారే తయారు చేసు కోవడం నేర్చుకున్నారు. ఘన జీవామతం, జీవామతం, పంచగవ్యం, నీమాస్త్రం, దనపరిణి కషాయం, బీజామతాలను భార్యాభర్తలే తయారు చేసుకుంటూ వ్యవసాయంలో వినూత్నంగా చేపట్టడానికి పూనుకున్నారు. సేంద్రియ ఎరువులను వాడుతూ కూరగాయల సాగు చేపట్టారు. ప్రధానంగా రెండు ఎకరాల్లోనే వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు, టమాటా, బీన్స్‌తోపాటు వివిధ రకాల ఆకు కూరలు సాగు చేస్తున్నారు. పంచగవ్యం, నీమాస్త్రం వంటివి పిచికారీ చేస్తూ పంటలకు రోగాలు రాకుండా కాపాడుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పది మందికి ఆరోగ్యం పంచడమే లక్ష్యంగా ప్రకతి వ్యవసాయం చేస్తూ వినియోగదారులకే నేరుగా విక్రయాలు చేస్తున్నారు.
వినియోగదారులకే విక్రయాలు
ప్రకతి వ్యవసాయంతో పండించిన కూరగాయలను నేరుగా వినియోగదారులకే అందిస్తున్నారు. ప్రస్తుతం 50 మంది రైతులకు రోజువారీగా కూరగాయలను అందిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. తోట వద్దనే వినియోగదారులు కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. సాధారణ కూరగాయల కంటే రూ.5 అధిక ధరకు విక్రయించినా.. వీరి కూరగాయలకు గిరాకీ మాత్రం తగ్గడం లేదు. దీంతో దంపతులిద్దరూ లాభాలను ఆర్జిస్తున్నారు. పలుమార్లు తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో స్టాల్స్‌ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తూ విక్రయించారు.
భవిష్యత్తు తరాలకు సేంద్రియ పంటలే అవసరం
ఒకే పంట కాకుండా వివిధ రకాల పంటలను సాగు చేయడంతో ఆదాయం బాగుంది. మాకు ఉన్న రెండు ఎకరాల పొలంలో ప్రకతి వ్యవసాయం పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నాం. ఎకరా పొలంలో కూరగాయలు పండిస్తే రోజుకు రూ.2 వేలు ఆదాయం వస్తోంది. ఇద్దరూ కలిసి పొలంలో పనిచేసుకుంటాం. సేంద్రియ ఎరువులతోనే పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మన భవిష్యత్తు తరాల వారికి తప్పనిసరిగా సేంద్రియ పంటలే అవసరం. ప్రకతి వ్యవసాయంలో పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ. - శ్రీవాణి, విజయులు, దిగువగూళూరు, పుత్తూరు మండలం