గుంతకల్లు : రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై పదేపదే జగన్ మోహన్ రెడ్డి భరించలేని ఛార్జీల భారాలు మోపుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ తెలిపారు. బుధవారం నాడు గుంతకల్లు సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఒకేసారి జూన్ నెలలో మూడుసార్లు స్పాట్ ఆఫ్ ఛార్జీలు పెంచడం, దీనికి తోడు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని ఆ భారం వినియోగ దారులపై వేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అదానీ, అంబానీలకు లాభాలు చేకూర్చేందుకు కోట్లాది రూపాయల కమీషన్లకు కక్కుర్తితో ముఖ్యమంత్రి ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో త్వరలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 2020 డిసెంబర్‌కు పూర్తి చేసి కాలువలకు నీరు అందిస్తామని అసెంబ్లీలోనే చెప్పిన సిఎం జగన్ రెడ్డి మాట తప్పాడన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించడం సిగ్గు చేటన్నారు. అప్పర్ భద్ర, నావలి రెండు అక్రమ ప్రాజెక్టులను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నా ముఖ్యమంత్రిలో చలనం లేదన్నారు. అప్పర్‌భద్ర నిర్మాణం జరిగితే రాయలసీమ ఎడారి ప్రాంతంగా మారుతుందని చెప్పారు. దీనిని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు రైతు గర్జన ప్రచార జాతాను 32 మండలాల్లో నిర్వహిస్తున్నామన్నారు. 21న అనంతపురం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్, బి.గోవిందు, వీరభద్ర స్వామి పాల్గొన్నారు.










