అనంతపురం కలెక్టరేట్ : నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరగడంతో పేదలపై మోయలేని భారాలు పడుతున్నాయని, తక్షణం ఈ ధరలను తగ్గించాలని సిపిఎం, ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసరాలు, కూరగాయలు, గ్యాస్, విద్యుత్ ఛార్జీల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం నాడు అనంతపురం టవర్ క్లాక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కూరగాయలు మెడలో తగిలించుకుని, పళ్లెంలో టమోటాలు, మిరపకాయలు, ఇతర కూరగాయలను వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి మాట్లాడుతూ నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. ఏమి కొనాలన్నా రూ.100కు పైగానే ఉన్నాయన్నారు. టమోటా, మిరపకాయలు కిలో వంద రూపాయలు ఉండడంతో పేద మధ్య తరగతి ప్రజలు వాటిని కొనలేని స్థితిలో ఉన్నారన్నారు. ఒక పక్క గ్యాస్, విద్యుత్ ఛార్జీల ధరలు పెరగిన సతమతం అవుతున్న ప్రజలపై నిత్యావసరాల భారాలు మరింత నడ్డివిరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర, కూరగాయల ధరలను తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం 1వ నగర కార్యదర్శి వి.రామిరెడ్డి మాట్లాడుతూ కూరగాయల సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం ప్రజలపై మాత్రం అధిక ధరల భారం పడుతున్నా చేష్టలుడిగి చూస్తోందన్నారు. ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాన్నారు. దళారి వ్యవస్థ ప్రజలు, రైతులను దోపిడీ చేస్తున్నా పాలకులు ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం మొద్దు నిద్రవీడి పెరిగిన నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ముస్కిన్, వెంకటనారాయణ, నగర కమిటీ నాయకులు ప్రకాష్, వలీ, మసూద్, లక్ష్మీనరసమ్మ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాలకృష్ణ, నరసింహారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, భగత్‌సింగ్ ఆటో యూనియన్ నాయకులు ఎన్టీఆర్ శీనా పాల్గొన్నారు.










