అనంతపురం కలెక్టరేట్ : సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న వారందరూ ప్రజల్లోకి శాస్త్రీయ ఆలోచనలు తీసుకెళ్లేందుకు జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ పిలుపునిచ్చారు. బుధవారం ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డితో కలిసి జెవివి సభ్యత్వం పోస్టర్‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం, జిల్లాలో జెవివి సభ్యత్వ క్యాంపెయిన్ జరుగుతోందని చెప్పారు. ప్రజలకు సైన్స్‌ను చెప్పే ఒకేఒక వేదికగా జనవిజ్ఞాన వేదిక నిలిచిందన్నారు. రాబోయే కాలంలో కాలేజీ విద్యార్థుల కోసం జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలను చేపట్టబోతోందని తెలిపారు. విద్యార్థులు జన విజ్ఞాన వేదిక సభ్యులుగా చేరాలని కోరారు. విశ్వం ఆవిర్భావం, జీవి పుట్టుక, మానవ పరిణామం, సమాజ పరిణామం, సైన్స్‌లో తాజా ఆవిష్కరణలు. ఈ అంశాలపై సైన్సు క్లాసులను జన విజ్ఞాన వేదిక విద్యార్థులకు విస్తతంగా నిర్వహించనుందని తెలియజేశారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా, ఈ క్లాసులలో పాల్గొనవచ్చని తెలిపారు. గ్రామాలలో వ్యాప్తి చెందే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సైన్స్ ప్రచారం చేయాలనుకునే యువతీ యువకులు జనవిజ్ఞాన వేదికలో చేరాలని కోరారు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్రీయ భావాల ప్రచారంలో విద్యార్థుల భాగస్వామ్యం అవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాలు, గాంగే నాయక్, జిల్లా కోశాధికారి రామిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.










