ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్
ప్రజాశక్తి - భీమవరం రూరల్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను అత్యంత దగ్గర చేస్తూ ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసిన సచివాలయాలు ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్నాయని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాయలం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆయన సోమవారం ప్రారంభించారు. సాయిబాబా ఆలయం రోడ్డులో రూ.65.30 లక్షలతో నూతనంగా నిర్మించిని సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం రూ.45.70 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహాత్మ గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే దిశలో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు అధికారులను మరింత అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత దేశంలో జగన్‌కే మాత్రమే దక్కిందన్నారు. ప్రజా సమస్యల పట్ల సచివాలయ సిబ్బంది జవాబుదారీతనంగా పనిచేస్తున్నారన్నారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్లు, డ్రెయినేజీ సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామన్నారు. భీమవరం నియోజకవర్గంలో ప్రజల కోరిక మేరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, తమది ప్రజా ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. రాయలం గ్రామ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌కు అక్కడి ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అదే మాదిరిగా అక్కడి ప్రజల కోరిక మేరకు మూడు సిసి రోడ్లను మంజూరు చేశారు.










