అనంతపురం కలెక్టరేట్ : గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దామని అనంతపురం రేంజ్ డిఐజి ఆర్‌ఎన్.అమ్మిరెడ్డి పోలీసు సిబ్బందికి సూచించారు. మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అనంతపురం ఎస్పీ కె.శ్రీనివాసరావుతో కలిసి జిల్లాలోని గ్రామ,వార్డు మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ విలేజ్ కానిస్టేబుల్, మహిళా పోలీస్ సమన్వయంతో పని చేయాలన్నారు. ఎస్‌హెచ్‌ఒ, డీఎస్పీలకు గ్రామ విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. గ్రామం, వార్డు స్థాయిలో నేరాలు జరుగకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని పోలీసు అధికారులకు చేరవేసే బాధ్యత గ్రామ, వార్డు పోలీసు సిబ్బందిపై ఉందన్నారు. ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించాలని సూచించారు. మహిళా సమస్యలపై దృష్టి సారించడంతో పాటు అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా వేయాలన్నారు. విధి నిర్వహణలో మంచి పనులు చేసే వారికి ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఎస్‌హెచ్‌ఒలు ప్రతివారం మహిళా పోలీసులతో సమావేశమై గ్రామస్థాయి సమస్యల పరిష్కారానికి కషి చేయాలన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయిలో సమస్యలను గుర్తించి పోలీసు అధికారుల దష్టికి తీసుకురావాలన్నారు. మహిళా వ్యవస్థ ఏర్పాటయ్యాక గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని, వీటిని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేలా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవసరమైన మెళకువలు, సూచనలు, సైబర్ నేరాలకు గురైన సందర్భంలో ఎలా ముందుకెళ్లి పరిష్కారం చేసుకోవచ్చు, చిన్నారులపై జరిగే లైంగిక దాడులు, గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌ల గురించి వివరిస్తూ లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఇ.నాగేంద్రుడు, ఎ.హనుమంతు, దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు, గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప, తాడిపత్రి డీఎస్పీ చైతన్య, టెక్నికల్ ఎస్‌ఐ సుధాకర్ యాదవ్‌తో పాటు సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.










