ప్రజాశక్తి-రాయదుర్గం పురపాలక మండలి సభ్యులు ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి పేరు తీసుకురావాలని విప్ కాపు రామచంద్రారెడ్డి సూచించారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు పోరాళు శిల్ప అధ్యక్షతన శుక్రవారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో 32 వార్డులకు సంబంధించి ప్రతివార్డుకూ 5 చొప్పున వీధిదీపాలు ఏర్పాటు చేసేందుకు వ్యక్తిగతంగా తాను సాయం చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఎక్కడైనా విద్యుత్, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకొస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా పట్టణంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు విద్యుత్ మోటార్లు మరమ్మతులు చేసే కాంట్రాక్టర్‌తో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. 2021లో సీఎం జగన్ రాయదుర్గం పర్యటన సందర్భంగా బిఆర్‌జిఎఫ్ నిధుల నుంచి వాడుకున్న రూ.13 లక్షలను కలెక్టర్‌తో చర్చించి వెనక్కి తెప్పిస్తామన్నారు. అలాగే పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులను ఆయా వార్డు సభ్యులు దగ్గరుండి నాణ్యతగా పనులు చేయించాలని సూచించారు. పురపాలక సంఘ అధ్యక్షులు పొరాల శిల్ప మాట్లాడుతూ గతంలో కొన్ని వార్డుల్లో చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదన్నారు. ఇందుకు విప్ కాపు మాట్లాడుతూ గతంలో చేసిన పనులకు ఇంజినీరింగ్ అధికారులు బిల్లులు మంజూరు చేయకపోతే తదుపరి కౌన్సిల్ సమావేశంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు కౌన్సిల్లో తీర్మానం చేయిస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కూరగాయల మార్కెట్ మొదటి అంతస్తు షాపు రూముల వేలం జరిపేందుకు, పాత మున్సిపల్ కార్యాలయ స్థానంలో గుడ్ విల్ పద్ధతిన కొత్త వాణిజ్య సముదాయం నిర్మించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పట్టణంలో రోడ్ల మరమ్మతులు నాణ్యంగా చేయాలని, తాగునీటి ఎద్దడి లేకుండా చేయాలని, పారిశుధ్యం మెరుగుపరచాలని పలువురు సభ్యులు సమావేశంలో జీరో అవర్లో అధికారులకు సూచించారు. గతంలో పురపాలక సంఘానికి చెందిన చెత్త తరలించే వాహనం కాంపాక్టర్ లోడర్ కాలిపోవడంతో తిరిగి కొత్తది కొనుగోలు చేసేందుకు 15 లక్షల రూపాయలు మంజూరు చేయాలని స్వచ్ఛంద్ర కార్పొరేషన్‌కు లేఖ రాసినట్లు కమిషనర్ దివాకర్‌రెడ్డి తెలిపారు. ఆజెండాలోని అన్ని అంశాలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌ఛైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, వలిబాషా, మున్సిపల్ ఇంజినీర్ రామమూర్తి, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న విప్ కాపు రామచంద్రారెడ్డి










