Jun 13,2022 23:28

చిత్తూరులో..

ఇంటింటికీ సిపిఎంలో నేతల డిమాండ్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజాసమస్యల పరిష్కారం కోసం చేపట్టిన జనం కోసం సిపిఎం- ఇంటింటికి సిపిఎం కార్యకమం చిత్తూరు నగరంలో 5వ రోజు న్యూప్రశాంతినగర్‌, వైఎస్సార్‌ కాలనీలో జరిగింది. ఈకార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పాల్గొని మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నిరంతరం ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని, అందుకోసమే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటికి వస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యస్పందన వస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు సిపిఎం బృందంతో చెపుతూ కమ్యూనిస్టులు బలపడితేనే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరానికి దూరంగా వున్న ప్రశాంతినగర్‌లో కాలువలు పూర్తిగా లేవని, స్మశానం కూడా ఆక్రమించుకోవడం జరిగిందని, టౌన్‌ బస్సు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం 20వ తేదీన సచివాలయం కార్యాలయంవద్ద నిరసన కార్యక్రమాలు, 27న కార్పొరేషన్‌, మున్సిపల్‌, మండలాల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు, జూలై 11న జిల్లా కలెక్టరేట్‌ వద్ద ప్రజాసమస్యలపై సిపిఎం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈకార్యక్రమాల్లో ప్రజలందరూ అత్యధికంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.సురేంద్రన్‌, జిల్లా సీనియర్‌ నాయకులు, పి.చైతన్య, నాయకులు లోకయ్య, ప్రసాద్‌, రాజేంద్ర, మంజుల తదితరులు పాల్గొన్నారు.
పలమనేరు: పట్టణంలో స్థానిక నీళ్ల కుంట ఎస్సీ కాలనీ నందు ఇంటింటికి సిపిఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి గిరిధర్‌ గుప్త, జిల్లా కమిటీ సభ్యులు ఓబుల్‌ రాజు, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్‌ మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలన అంటున్న ప్రభుత్వం ప్రజాసమస్యలను పట్టించుకోకుండా గాలికి వదిలేశారన్నారు. ప్రధానంగా నీటి సమస్య అధికంగా ఉందని, దీనిపై అనేకసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించారు. అలాగే దళితులకు ఉచితకరెంటును కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాజా, జయంతి, ఖైరున్నిసా, శాంతమ్మ సంజరు తదితరులు పాల్గొన్నారు.