May 05,2023 21:58

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారితో మాట్లాడుతున్న రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని

        అనంతపురం కలెక్టరేట్‌ : పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేస్తోందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ ఛైర్మన్‌ గిరిజమ్మతో కలిసి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని తనిఖీ చేశారు. పిల్లలు, గర్భిణుల విభాగాలను పరిశీలించారు. అక్కడ అందుతున్న వైద్యసేవలపై రోగులతో ఆరా తీశారు. ఆసుపత్రిలో ఎంవోటీ ఆపరేషన్‌ థియేటర్‌ను ప్రారంభించారు. అటునుంచి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజావైద్యం మెరుగు పరిచేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిందన్నారు. గ్రామాల్లో వైద్యులు ఇంటింటికీ వెళ్లి రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందుల పంపిణీ చేపట్టే ఫ్యామిలీ డాక్టర్‌ విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 49 వేల మందికి పైగా వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టడంపై ఇతర రాష్ట్రాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయన్నారు.
17 మెడికల్‌ కళాశాలల మంజూరు
దేశంలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేసి నిర్మాణాలు ప్రారంభించామన్నారు. వాటిలో ఐదు కాలేజీలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు, బోధన తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయనగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం కాలేజీలలో అడ్మిషన్లకు అనుమతులు వచ్చాయని, రాజమండ్రి మెడికల్‌ కాలేజీకి సైతం అనుమతి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మంత్రి దృష్టికి పలు సమస్యలు
అనంతపురం సర్వజన ఆసుపత్రి అభివృద్ధి, సమస్యలను అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతపురం సర్వజన ఆసుపత్రికి ఇతర జిల్లాల నుంచి సైతం రోగులు వస్తుంటారన్నారు. నిత్యం దాదాపు 2000 మంది ఓపీ సేవల వద్ద ఉండే పరిస్థితి ఉందన్నారు. రద్దీకి అనుగుణంగా సర్వజన ఆసుపత్రి సామర్థ్యం 550 పడకలకు, ఎంసీహెచ్‌ బ్లాక్‌ సామర్థ్యం 600 పడకలకు, ఏఎంసీ సామర్థ్యం 200 పడకలకు పెంచాల్సి ఉందన్నారు. క్యాజువాలిటీని సైతం 75 పడకలకు పెంచాలన్నారు. మెడికల్‌ కాలేజీ విస్తరణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ జిల్లాలో అవయవదానం చేసేందుకు యువత ముందుకు వస్తోందని, అలాంటి దాతల వివరాల సేకరణ, అవయవాలు భద్రపరచడం, అత్యవసర రవాణా వంటి సేవలు సూపర్‌ స్పెషలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి, ఏపీఎంస్‌ఐడీసీ రాష్ట్ర డైరెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి డీఎంఈ సత్యవర ప్రసాద్‌, సూపరింటెండెంట్‌ రఘునందన్‌, డిఎంహెచ్‌ఒ వీరబ్బాయి, ఆర్డీవో మధుసూదన్‌ పాల్గొన్నారు.