Jun 29,2023 22:18

శిక్షణ డీఎస్పీలతో మాట్లాడుతున్న డిజిపి కెవి.రాజేంద్రనాథ్‌రెడ్డి

          అనంతపురం : ప్రజలకు సత్వర న్యాయం అందించి వారికి పోలీసు సేవలను మరింత చేరువ చేసినప్పుడే పోలీసు శాఖపై నమ్మకం పెరుగుతుందని రాష్ట్ర డిజిపి కెవి.రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ డీఎస్పీలతో గురువారం నాడు ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సమాజం, వత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలా వ్యహరించలి.. ప్రజలకు అందించాల్సిన సేవలు.. విధినిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకితభావం, పారదర్శకత, క్రమశిక్షణ, మంచి ప్రవర్తన కలిగి ఉండి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. వత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం చూపాలన్నారు. ఇటీవల పెరిగిపోతున్న సైబర్‌ నేరాల కట్టడికి కషి చేయాలన్నారు. ప్రజలు సైబర్‌ నేరస్తుల బారిన పడకుండా అవగాహన చేయడంతో పాటు వాటి నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. మహిళల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పోలీసుశాఖలు కషి చేస్తున్నాయని, ఆ దిశగా మహిళల రక్షణ కవచంగా దిశ యాప్‌ పని చేస్తోందన్నారు. దిశ కాల్స్‌కు సకాలంలో పోలీసులు సత్వరమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. నేరాలు జరుగకుండా ప్రివెన్సన్‌, డిటెక్సన్‌ల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, చట్టాలను ఉపయోగించి నేరాలు తగ్గేందుకు కృషి జరగాలన్నారు. గంజాయి, తదితర మాదకద్రవ్యాల నియంత్రణపై ఇప్పటికే పోలీసు శాఖ ఉక్కుపాదం మోపిందన్నారు. మత్తుపదార్థాల అనర్థాలపైనా ప్రజల్లో అవగాహన తెస్తున్నామని చెప్పారు. ఇలాంటి పూర్తి స్థాయిలో నియంత్రణ జరిగేలా ఆ శాఖల పరిధిలో పోలీసులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు వ్యక్తిగత విషయ పరిజ్ఞానంతో పాటు చట్టాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలకు సత్వర న్యాయం జరగడమే ధ్యేయంగా పోలీసులు విధులు నిర్వహించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ఐజిపి వెంకట్రామిరెడ్డి అనంతపురం ప్రిన్సిపాల్‌ వి.గీతాదేవి, ఎస్పీ కె.శ్రీనివాసరావుతో పాటు ట్రైనీ డీఎస్పీలు పాల్గొన్నారు.