రాష్ట్రస్థాయిలో జిల్లాకు మూడో స్థానం
ప్రజల వద్దకు వెళ్లి వైద్యం అందించాలి : కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్ :
పేదలకు వారున్న చోటికి వైద్యులు వెళ్లి వైద్యం చేయడం, మందులు సరఫరా చేయడం పట్ల ప్రజలలో వైద్యుల పట్ల మరింత అభిమానం పెరగడంతో పాటు నమ్మకం, ధైర్యం కలుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఫ్యామిలీ డాక్టర్ ఒక మాసం పూర్తిచేసుకున్న సందర్భంగా జిల్లా మూడవ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. వీకోట మండలంలోని ఓగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు 100శాతం పైగా గ్రామాలను సందర్శించడంతోపాటు పలువురికి వైద్యసేవలు అందించడం జరిగింది. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలోని కల్లూరు ఆరోగ్య కేంద్రం డాక్టర్ నాలుగో స్థానం లభించిందని, మొదటిస్థానం రాజేష్ నాయక్ ఓగు, రెండవ స్థానం సోమశేఖర్ విజయపురం, మూడవస్థానం నారాయణస్వామి గంగవరం, నాలుగవ స్థానం జానకి కల్లూరు, ఐదవ స్థానం నందిని ఓబులను జిల్లా కలెక్టర్ అభినందిస్తూ వారికి సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీహరి, డిహెచ్‌ఎస్ నాయక్, ఫ్యామిలీ డాక్టర్ జిల్లా అధికారి హరినాథ్‌రెడ్డి, శ్రీనివాసరావు ఇతర వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
వైద్యులపట్ల నమ్మకం పెరిగింది..
- డాక్టర్ రాజేష్ నాయక్,
ఓగు పిహెచ్‌సి వికోట మండలం
డాక్టర్ అంటే అందుబాటులో ఉండరు పేషెంట్‌కు కావలసిన సమయం వెచ్చించడానికి కష్టమవుతుందనే భావన గతంలో ప్రజల్లో ఉండేది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్‌గా గ్రామాలకు వెళ్లినప్పుడు గ్రామస్తులు మమ్మల్ని ఆహ్వానించే విధానం చాలాగొప్పగా ఉంది. సరైన వైద్యసహాయం అందిస్తామని వారికి నమ్మకం కలిగించడం జరిగింది. అదేవిధంగా దీర్ఘకాలిక రోగులకు మరింత నమ్మకం కలిగిస్తూ వారికి వైద్యసహాయం చికిత్సలు నిర్వహించడం వారు గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. ఇది గొప్ప నిర్ణయం ఆరోగ్య వ్యవస్థలు మరొక విప్లవంగా భావిస్తున్నాం.
గ్రామాల్లో వైద్యం అందించడం బాగుంది
- డాక్టర్ జానకి,
కల్లూరు పిహెచ్‌సి పులిచెర్ల మండలం
గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు వైద్యులంటే గౌరవం చూపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వైద్యుల పట్ల మరింత గౌరవం కలుగుతుంది. ప్రతినెలా మా గ్రామాలకు వస్తే మా ఆరోగ్యం బాగుంటుందని చాలామంది మాతో అంటున్నారు. అనేక చికిత్సలు పరీక్షలు చేయడంతో పాటు అవసరమైతే పై ఆసుపత్రులకు పంపడం కూడా జరగడం పట్ల నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించుకున్న వారికి వారి ఇంటి వద్దనే వారికి కావాల్సిన వైద్యం అందించడం వారిలో ధైర్యాన్ని కల్పించడం జరుగుతోంది.










