Jun 01,2023 09:18

ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌ హరిప్రసాదరెడ్డి

      అనంతపురం కలెక్టరేట్‌:సమాచార హక్కు చట్టం కేసుల పరిష్కారానికి పేదలైన అర్జీదారులు మంగళగిరిలోని కమిషన్‌ కార్యాలయం చుట్టూ చక్కర్లు కోట్టాల్సిన పనిలేకుండా ప్రజల వద్దకే సమాచార కమిషన్‌ వస్తోందనిరాష్ట్ర సమాచార కమిషనర్‌ హరి ప్రసాద రెడ్డి తెలిపారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్ర సమాచార కమిషనర్‌ మంగళ, బుధవారాల్లో రెండు రోజుల జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. బుధవారం నాడు కలెక్టరేట్‌ లోని రెవెన్యూ భవన్‌ లో పెండింగ్‌లో సమాచార వితరణలో విఫలమైన కేసుల్లో అప్పీళ్లపై విచారణ చేపట్టారు. మొత్తం 28 ఫిర్యాదులను విచారించి విద్యుత్‌ శాఖకు చెందిన రెండు కేసుల్లో అర్జీదారులకు ఫిర్యాదుకు రూ.2,500 చొప్పున మొత్తం రూ.5,000 పరిహారం చెల్లించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించిన మరో 9 కేసుల్లో సమాచార వితరణకు జరిగిన ఆలశ్యంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ సహేతుకంగా లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.