తాడిపత్రి : తాడిపత్రి మున్సిపాలిటీ ప్రజలు తనను ఆదరించి ఎన్నుకున్నారని అందుకు వారి కోసం ఎళ్లవేళలా పని చేస్తానని మున్సిపల్ ఛైర్మన్ జెసి.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటున్న మున్సిపల్ కమిషనర్‌పై జిల్లా అధికారులు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం 4వ రోజు కొనసాగింది. జెసి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై దీక్షా శిబిరం నుంచి పట్టణంలోని గాంధీ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ వైఖరిపై తెలుగుదేశం పార్టీ పాలకవర్గ కౌన్సిలర్లు 210 వినతిపత్రాలు జిల్లా అధికారులకు అందజేసినా స్పందించకపోవడం బాధాకరం అన్నారు. మున్సిపాల్టీలో ఎవరో పంపిన జెండా ఆమోదించేది లేదన్నారు. అభివద్ధికి సచివాలయం పరిధిలో 20 లక్షల రూపాయలు అని ప్రకటించిన ఆ ఊసే కనిపించలేదన్నారు. మున్సిపాలిటీ వాహనాలు మరమ్మతు చేయించడానికి ముందుకొస్తే హౌస్ అరెస్ట్ చేయించిన ఘనత వీరిది అన్నారు. కలెక్టర్, రీజినల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనంతపురం శిబిరం సందర్శించి పాలకవర్గ 15 డిమాండ్లను పరిష్కరించేంత వరకు నిరసన నిర్విరామంగా కొనసాగిస్తామని అన్నారు. అధికార పార్టీ వారికి వత్తాసు పలుకుతూ ఉన్న కమిషనర్ వైఖరి మార్చుకుని పురపాలక సంఘం అభివద్ధికి సహకరించాలని సూచించారు.










