పలమనేరు వార్షికోత్సవ సభలో వక్తలు
ప్రజాశక్తి - పలమనేరు, వి.కోట
'తెలుగు పత్రికారంగంలో ప్రజా పక్షపాతిగా ఉంటూ, ప్రతి అక్షరం ప్రజలపక్షంగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది ప్రజాశక్తి' అని వక్తలు ఉద్ఘాటించారు. 42వ వార్షికోత్సవ సభ పలమనేరు పట్టణంలోని సాయిశ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగింది. జనవిజ్ఞాన వేదిక నాయకులు కుమారస్వామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ యువత సమాజానికి తాము ఏమి ఇచ్చామని ప్రశ్నించుకోవాలన్నారు. ఏదైనా సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లాలన్నారు. కలలతో సరిపెట్టుకోకుండా విజేతగా నిలవాలన్నారు. ప్రతిభ ఒక్క రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించేలా పాటు పడాలన్నారు. 'ప్రజాశక్తి' జిల్లా కోఆర్డినేటర్ ప్రకాష్ మాట్లాడుతూ పత్రిక వ్యవస్థాపకులు పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని అధ్యయనం చేస్తే ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు. తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులను, ఆటుపోట్లను తట్టుకుని నిలిచిందన్నారు. యుటిఎఫ్ నాయకులు సోమచంద్రారెడ్డి మాట్లాడుతూ పత్రికలు చదవడం అలవరచుకుంటే సమాజాన్ని ఆకళింపు చేసుకోవచ్చన్నారు. మూఢనమ్మకాలు, జాతకాలు, మూఢవిశ్వాసాలు నమ్మరాదని జెవివి రాష్ట్ర నాయకులు యుగంధర్ ప్రదర్శించిన ప్రదర్శనలు, చెప్పిన కథలుయ ఉవతను విశేషంగా ఆకట్టుకున్నాయి. మాయ లేదు మంత్రం లేదు.. ఉన్నదంతా సైన్స్ ఒక్కటేనని, అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. సిపిఎం నాయకులు గిరిధర్‌గుప్త మాట్లాడుతూ ప్రజాశక్తి పత్రికలో వ్యాసాలు ప్రపంచ విజ్ఞానాన్ని పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమానికి స్టాఫర్ సిఎస్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. వార్షికోత్సవం సందర్భంగా 'ప్రజాశక్తి' తీసుకొచ్చిన ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్క్యులేషన్ ఇన్‌ఛార్జి రామాంజునేయులు, విలేకరులు పాల్గొన్నారు.










