ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
స్వాతంత్య్ర పోరాటంలో వేలాది మంది ఎన్నో త్యాగాలు చేశారని ఫలితంగా వచ్చిన స్వాతంత్య్ర ఫలితాలు దేశ ప్రజలకు దక్కలేదని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కాంజీవరం సురేంద్రన్ అన్నారు. సోమవారం స్థానిక మునిసిపల్ పార్కులో సురేంద్ర అధ్యక్షతన ప్రజాసంఘాల ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య, సిపిఎం సీనియర్ నాయకులు చల్లా వెంకటయ్య, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయకులు ప్రసాద్, డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు లోకయ్య షణ్ముగం, భవననిర్మాణ కార్మికుల యూనియన్ జిల్లాఅధ్యక్షులు మిన్నల్ జ్యోతి, విఆర్‌ఏ అసోసియేషన్ జిల్లాజాయింట్ సెక్రటరీ కోదండన్ పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో కనీస పాత్రలేని బీజేపీ, మోడీ సర్కారు స్వాతంత్ర వేడుకలను జరపాలని కోరడం విడ్డూరమరి విమర్శించారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే పార్టీ అనే నినాదాన్ని మోడీ ప్రభుత్వం పౌరసత్వాన్ని, మత ప్రాతిపదికపై నిర్వచించేలా సవరణ చట్టం తెచ్చిందన్నారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛపై నిరంతరం దాడులు చేస్తూ తప్పుడు కేసులతో మేధావులను, పాత్రికేయులను జైలు పాలు చేస్తున్నారని ఆరోపించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం లో భాగంగా లౌకిక రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్నీ కాపాడుకోవాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.










