ప్రజాసమస్యలపై సిపిఎం రాయబారం
జిల్లా వ్యాప్తంగా తరలిరానున్న బాధితులు
అనేక సమస్యలతో జనం సతమతం
నేడు కలెక్టరేట్ వద్ద సిపిఎం నిరసన
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
జిల్లాలో అనేక సమస్యలతో జనం సతమతమవుతున్నారు. ముఖ్యంగా పేదలబాధలు వర్ణానాతీతం. వారి సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలీక, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎం వారికి అండగా ఉండాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల కాలనీల్లో ఇంటింటికీ సిపిఎం కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈసందర్భంగా అనేక సమస్యలు వారి దృష్టికి వచ్చాయి. వీటిపై ఇది వరకే ఆయా సచివాలయాల పరిధిలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలనూ కమిషనర్ల వద్దకు తీసుకెళ్లి ఎక్కువ శాతం పరిష్కరించగలిగారు. ఇక జిల్లాస్థాయిలో పరిష్కరిచాల్సిన వాటిపై కలెక్టర్ వద్దకు అర్జీల రూపంలో రాయబారం నడిపేందుకు నేడు సిపిఎం సన్నద్ధమయ్యింది.
టిడ్కో ఇళ్లకు నిరీక్షణ
గత ప్రభుత్వ హయాంలో పుంగనూరు, చిత్తూరు ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను నిర్మించింది. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటిని సంబంధిత పేదలకు ఇవ్వడం లేదు. దీంతో పేదలు వీటికోసం నిరీక్షిస్తున్నారు. వీటి కోసం డబ్బులు కట్టి ఎప్పటికీ రాకపోవడంతో వారు అల్లాడుతున్నారు. రద్దు అయిన ఇళ్లకు సంబంధించి లబ్దిదారులకు ఇప్పటి వరకు డబ్బులు తిరిగీ చెల్లించలేదు. చిత్తూరు, పుంగనూరులో ఇంకా పనులు జరుగుతున్నాయి.
పవర్‌లూమ్ కార్మికుల వెథలు
నగరిలో ఉన్న పవర్‌లూమ్ కార్మికులు అనేక ఇబ్బందులతో కటకటలాడుతున్నారు. ఇక్కడ ఏళ్ల తరబడి కూలీ ధరలు పెరగడం లేదు. పెంచాలని వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇక 300 యూనిట్లకన్నా ఎక్కువ కరెంటు వస్తోందని చెబుతూ సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారు. ఈడి ఛార్జీపేరుతో అదనంగా కరెంటు బిల్లులు వేస్తున్నారు. వీటన్నింటినీ పరిష్కరించాలని వారు డిమాండు చేస్తున్నారు.
ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలి
జిల్లాలో ఉపాధి హామీ కూలీలు ఎక్కువ మొత్తంలో పనిచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు ఉండడం లేదు. ముఖ్యంగా ఎండల సమయంలో మంచినీరు, మజ్జిగ, నీడ వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. అయితే ఇవి కల్పించడం లేదు. ఇక రెండో పూట కూడా పని చేయాలని నిబంధన విధించారు. దీనివల్ల కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇంకా ఇతర డిమాండ్లు
- చిత్తూరు నగరంలో పేదలు నివశిస్తున్న కాలనీలలో తాగునీరు సమస్యతో పాటు రోడ్లు, డ్రైనేజీ కాలవలు ఏర్పాటు చేయాలి. లెనిన్‌నగర్‌లో ఉన్న డంపింగ్ యార్డు సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
- పలమనేరు ప్రాంతంలో దళితుల భూములను జగనన్న కాలనీలకు ఇచ్చే వీటికి నష్టపరిహారం చెల్లించాలి.
- జిల్లాలోని 31మండలాల్లో అర్హులైన వారికి రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పులు చేయాల్సి ఉంది.
- పుంగనూరు ప్రాంతంలో నిరుద్యోగుల ఉపాధి కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.
- హంద్రీనీవా కాలువ పెండింగ్ పనులు పూర్తిచేయాలి. రైతులకు కృష్టాజలాలు అందించాలి.
- కుప్పంలో అంగన్‌వాడీ వర్కర్లను వేధిస్తున్న సిడిపిఓపై చర్యలు తీసుకోవాలి.
- నూతన విద్యావిధానం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ చర్యను మానుకోవాలి
- అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి
సమస్యలను పరిష్కరించాలి
జిల్లాలో పేదలు, కార్మికులు, రైతులు, స్కీమ్ వర్లర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంటింటికీ సిపిఎం నిర్వహించిన సందర్భంగా అనేకం వెలుగులోకి వచ్చాయి. వాటన్నింటినీ పరిష్కరించాలి.
- వాడగంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి










