Oct 06,2023 21:10

ఫొటో : అర్జీని స్వీకరిస్తున్న కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌

ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి
ప్రజాశక్తి-సీతారామపురం : జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న మారుమూల గ్రామాలలోని ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్‌ హరి నారాయణ పేర్కొన్నారు. సీతారామపురం మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ హరినారాయణ, జెసి కూర్మానాథ్‌ జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అందిన అర్జీలను సంబంధిత అధికారులకు ఇచ్చి నిర్ణీత గడువులోగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు భూములు కావాలని అధికంగా అర్జీలు వచ్చాయని, అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్‌పై సమస్యలు ఉన్నాయన్నారు.
మొత్తం 290 పైగా ప్రజా అర్జీలు వచ్చాయన్నారు. వీటన్నింటికీ త్వరలో పరిష్కారం అందుతాయన్నారు. మే 9వ తేదీ నుండి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రజలలో సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలను ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో పరీక్షించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. సీతారామపురం మండలంలో రెండు హైవే నిర్మాణాలు వెళ్తుండడంతో రైతులు నష్టపరిహారం సరిపోవడం లేదని అర్జీలు ఇచ్చారని వారు ఆర్బిట్రేషన్‌ పిటిషన్‌ ఇస్తే చట్ట ప్రకారం కలెక్టర్‌ కార్యాలయం నుండి నష్టం పరిహారం సరిపోని రైతులకు న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. డ్రెయిన్లు, రోడ్లు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించామన్నారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో మండల కేంద్రాల్లో ముందుగానే షెడ్యూల్‌ ప్రకటించి ప్రతి బుధ, శుక్రవారాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రానికి రాలేని గ్రామాల ప్రజలు సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే సంతృప్తికర స్థాయిలో పరిష్కరించేందుకు మండల కేంద్రంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీతారామపురం మండలంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రతి మండలంలో షెడ్యూల్‌ ప్రకారం జగనన్న కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ కరుణకుమారి, జెడ్‌పి సిఇఒ చిరంజీవి, డిపిఒ సుస్మితా రెడ్డి, డ్వామా పిడి వెంకటరావు, డిఆర్‌డిఎ పిడి సాంబశివారెడ్డి, సర్వే ఎడి హనుమన్‌ ప్రసాద్‌, డిఎంహెచ్‌ఒ పెంచలయ్య, హౌసింగ్‌ పిడి నాగరాజు, అగ్రికల్చర్‌ జెడి సుధాకర్‌ రాజు, సిపిఒ ఎఎస్‌ రాజు, ఆర్‌టిసి రీజినల్‌ మేనేజర్‌ శేషయ్య, డిటిసి చందర్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బి, ఎలక్ట్రికల్‌ ఎస్‌ఇలు, పలువురు జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.