
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - గార: రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మండలంలోని వాడాడలో గురువారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి నేరుగా రోగుల ఇంటి వద్దకే వైద్యులను పంపించి వైద్యం అందిస్తున్నామన్నారు. ఇటువంటి సౌలభ్యం ఏడున్నర దశాబ్దాల్లో ప్రజలకు అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఈ సౌకర్యాన్ని అందిస్తున్న జగన్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలను కోరారు. ఆరోగ్య సురక్షలో వైద్య పరీక్షలతో పాటు ప్రజలకు ఉచితంగా మందులనూ అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు గ్రామాల్లోనే కంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, వైద్యులు శెట్టి పద్మావతి, ఆర్.మనోజ్, సర్పంచ్ సుంకాన సురేష్, తేజ, ఎం.ఎల్.బి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.