Sep 11,2023 21:28

పోస్టర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌:
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జగనన్న ఆరోగ్య సురక్ష పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహణపై ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరాల నిర్వహణలో అథికారులు, వైద్యులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి మాట్లాడుతూ వాలంటీర్లు వారి పరిధిలోని అన్ని కుటుంబాలను సందర్శించి ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించాలన్నారు. ఎఎన్‌ఎంలు, క్లస్టర్‌ హెల్త్‌ ఆఫీసర్లకు సమాచారం అందించడం ద్వారా ఇంటింటికీ వెళ్లి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. గ్రామాల్లో, వార్డుల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తారన్నారు. శిబిరాలకు ఇద్దరు స్పెషలిస్టులు, ఇద్దరు పిహెచ్‌సి వైద్యులు హాజరవుతారని, రోగులకు పరీక్షలు నిర్వహించి వైద్యం అందజేస్తారన్నారు. ఈనెల 15 నుంచి కార్యక్రమాన్ని వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తారని తెలిపారు. 16న వైద్య బృందాల పరిశీలన ఉంటుందన్నారు. ఆ తర్వాత వైద్యులు గ్రామాల వారీగా సందర్శించి శిబిరాలను నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి, ఉప కలెక్టర్‌ జయదేవి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్‌, జెడ్‌పి సిఇఒ వెంకట్రామన్‌, డ్వామా పీడీ జి.వి చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు.