డిఎంహెచ్‌ఒ మహేశ్వరరావు
ప్రజాశక్తి - పాలకోడేరు
ప్రజారోగ్యమే ధ్యేయంగా గ్రామాల్లో వైద్య సేవలందిస్తూ ప్రజలకు రక్తహీనత లేకుండా ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా సేవలందించాలని డిఎంహెచ్‌ఒ మహేశ్వరరావు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకోడేరు పిహెచ్‌సి వైద్య సిబ్బందితో సమావేశం అనంతరం ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో రక్తహీనతతో చాలామంది బాధపడుతున్నారన్నారు. రక్తహీనత లేకుండా ఆరోగ్య సూత్రాలను చెబుతూ పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలన్నారు. మాతృ, శిశుమరణాలు మరణాలు లేకుండా గర్భిణులు, బాలింతలను ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సిజేరియన్‌లు అవుతున్నాయని, వీటిని నివారించాల్సిన బాధ్యత వైద్యసిబ్బందిపైనే ఉందని తెలిపారు. అనంతరం గ్రామంలో వైద్య సిబ్బంది ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. రావిచెట్టు సెంటర్లో మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ స్వర్ణనిరంజని, సిహెచ్‌ఒ సత్యనారాయణ, పిహెచ్‌ఎన్ కుమారి, హెల్త్ సూపర్‌వైజర్లు శంకర్, శ్రీనివాస్, అమ్మాజీ, ఆరోగ్య సహాయకులు, ఎంఎల్‌హెచ్‌పిలు, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.










