Apr 19,2023 21:12

ప్రజాశక్తి - తణుకురూరల్‌
ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం తణుకు మండలం వేల్పూరు పిహెచ్‌సి పరిధిలోని కొమరవరం గ్రామ సచివాలయంలో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని కలెక్టరు ప్రశాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధిని గుర్తించడం గుర్తించిన వ్యాధిని తగ్గించేందుకు వివిధ రకాల వైద్య సేవలందించి మందులివ్వడం జరుగుతుందన్నారు. పిహెచ్‌సిలో ఉన్న ఇద్దరు డాక్టర్లు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు ఇస్తారని తెలిపారు. 108, 104 వాహనాలను బలోపేతం చేయడం, ఆరోగ్యశ్రీ అమలుచేయడంతో పాటు ఆరోగ్య ఆసరా కూడా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి.మహేశ్వరరావు, వైద్యాధికారులు డాక్టర్‌ కిషోర్‌, డాక్టర్‌ హరిణి, తహశీల్దార్‌ పిఎన్‌డి ప్రసాద్‌, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.