Oct 05,2023 18:27

జగనన్న ఆరోగ్య సురక్ష శిభిరంలో అధికారులు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని డిఎల్డిఓ వసుమతి పేర్కొన్నారు. బుధవారం తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంపీడీఓ కన్నం హేమలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వసుమతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందివ్వాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. వాలంటీర్లు తమ పరిధిలోని గహాలను సందర్శించి ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అవగాహన కల్పిస్తారని వసుమతి తెలిపారు. ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసిన అనంతరం ఏఎన్‌ఎం, సీహెచ్‌సీ వైద్యాధికారులు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవసరమైన చికిత్సలు ఉచితంగా అందిస్తారన్నారు. వైద్య శిబిరాల్లో వ్యాధిగ్రస్తులకు మూత్ర, రక్త తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యసహాయం అందించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారన్నారు. అవసరమైతే రెఫరల్‌ ఆస్పత్రికి పంపి ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన ఆరోగ్యం అందించడం జరుగుతుందన్నారు. ప్రధానంగా ప్రజలు ఆరోగ్య వంతంగా ఉండాలన్న ప్రభుత్వ ముఖ్య సంకల్పమని వసుమతి చెప్పారు. సర్వేలో సాధారణ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు గుర్తించి అవసరమైన వైద్యం అందిస్తామని తెలిపారు. తహశీల్దార్‌ లావణ్య, ఈఓపిఆర్డి నారాయణరెడ్డి, వరిగొండ మెడికల్‌ ఆఫీసర్‌ నరసింహారావు, ఎంఇఒ జయరాం రెడ్డి, ఆరోగ్య శాఖ పంచాయతీ కార్యదర్శులు సచివాలయ వాలంటీర్లు పాల్గొన్నారు.