
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి పంచాయతీలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అంతా వినియోగించుకోవాలని కోరారు. ప్రజా వైద్యాన్ని ఇవాళ ఎక్కువ మందికి చేరువ చేస్తున్నామని, ఆ ఫలాలన్నీ పేదలకు అందుతున్నాయని చెప్పారు. విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అన్నీ పేదలకు అనుసంధానమయ్యాయని తెలిపారు. వీటి వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని గుర్తించాలని, ప్రజా వైద్యంపై నమ్మకం పెంచుకోవాలని కోరారు. వ్యాధి బారిన పడిన వారిని చేయి పట్టుకుని నడిపిస్తూ ఆ వ్యాధి నయమయ్యే వరకు వారికి ఉచితంగా వైద్యం నుంచి మందుల వరకు అన్నీ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటరావు, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఎంపిపి అంబటి నిర్మల, జెడ్‌పిటిసి రుప్ప దివ్య, సర్పంచ్ లోలుగు శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షులు చిట్టి జనార్థనరావు, గంగు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.