
* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలను ఆరోగ్యవంతులని చేయడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఇంటి వద్దకు వచ్చిన వైద్య సిబ్బందికి సహకరించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. నగరంలోని పుణ్యపువీధి యుపిహెచ్‌సి ఆధ్వర్యాన ఏడు రోడ్ల కూడలిలోని వైఎస్‌ఆర్ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆరోగ్య శిబిరానికి వచ్చిన ఒపి, ల్యాబ్ పరీక్షలు, మందులు ఇచ్చే విధానం, సిబ్బంది పనితీరు, స్పెషలిస్ట్ డాక్టర్ల హాజరును పరిశీలించారు. బిపి, షుగర్, గుండె సంబంధిత, ఇతర వ్యాధులు ఎంతమందికి ఉన్నాయనే విషయాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వ్యాధిగ్రస్తులను స్పెషలిస్టు వైద్యులతో గుర్తించి, వారికి చికిత్స అందించనున్నట్లు తెలిపారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదికల ఆధారంగా వారికి చికిత్స అందించడమే కాకుండా ఇంకా ఏవైనా వ్యాధులు ఉంటే మెరుగైన వైద్యం కోసం సత్వర చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.