ప్రజారోగ్య పరిరక్షణ పంచాయతీ కార్యదర్శుల కర్తవ్యం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: ప్రజారోగ్య పరిరక్షణ పంచాయతీ కార్యదర్శుల ప్రధాన కర్తవ్యమని, మరింత బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుంచి జిల్లా కలెక్టర్ డీపీవో లక్ష్ష్మీ, డీసీడీపీఆర్‌సీ షణ్ముగరామ్‌తో కలసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్వమిత్వ, శానిటేషన్, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ, పన్నుల వసూలు తదితర అంశాలపై ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ల పై పంచాయతీ కార్యదర్శులు అవగాహన పెంచుకుని వాటిని అమలు చేయాలని, ఈ నియమ నిబంధనలను సక్రమంగా అమలు చేయకపోతే అందుకు పూర్తి బాధ్యత కార్యదర్శులే వహించాల్సి ఉంటుందన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు అధిక ప్రాధ్యాన్యత ఇవ్వాలని తెలిపారు. స్వమిత్వ (గ్రామకంఠం) రీసర్వే కు సంబంధించి ఈవోపీఆర్డీలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఈ ప్రక్రియ పై అవగాహన పెంచుకోవాలని.. కార్యదర్శులకు ఈ సర్వే పకడ్బందీగా చేసేందుకు సర్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్వమిత్వ కు సంబంధించి 739 గ్రామాలలో డ్రోన్ ఫ్లై పూర్తి కాగా.. ఓఆర్‌ఐ మ్యాప్ -1లు 96 అందగా, గ్రౌండ్ ట్రూతింగ్ 12 గ్రామాల్లో పూర్తి అయ్యిందని, 83 గ్రామాలలో జరుగుతోందని..42 అంశాల తో కూడిన ఫ్రొఫార్మాను ప్రతి ఇంటి వద్ద సమయం కేటాయించి కొలతలు పక్కగా చేసిన అనంతరం పూర్తి చేయాలన్నారు. పూర్తి వివరాలను సేకరించాలని, ఇందులో ఎలాంటి తప్పొప్పులకు తావు ఉండరాదని సూచించారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు సంబంధించి కొత్తగా మంజూరైన 94 షెడ్ లకు గానూ 4 షెడ్ లు పూర్తి కాగా 21 పురోగతిలో ఉన్నాయని.. మిగిలిన 69 షెడ్ ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని తెలిపారు. కేంద్రాల నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం ద్వారా ఆదాయం పొందాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయడం విధిగా జరగాలని, పైపులైన్ల మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయాలని తెలిపారు. గ్రామాలలో వీధి దీపాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని.. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
లేబర్ బడ్జెట్ ప్రకారం అంచనాలను చేరాలి
ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వేతన దినాలను.. ప్రాధాన్యతా పనులను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం .హరినారయణన్ అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో డ్వామా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన వేతన దినాలను తప్పనిసరిగా కూలీలకు కల్పించేలా చూడాలన్నారు. చానల్స్ పునర్నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గహ నిర్మాణ పనులకు సంబంధించి 90 పని దినాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు. ఈ ఏడాది అమత్ సరోవర్ పనులు మండలానికి ఒకటి చొప్పున నిర్వహించడం జరిగిందని.. వచ్చే ఏడాదికి 75 పనులను జిల్లా వ్యాప్తంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ సభలు పెట్టి పనులను నిర్ణయించుకోవాలని.. డిసెంబర్ 15 లోపు ప్రతి గ్రామానికి కావాల్సిన ప్రాధాన్యత పనులను గ్రామ సభలలోనే గుర్తించాలని సూచించారు. పనుల గుర్తింపులో వెనుకబడిన ఏపీడీలను కారణాలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్‌లో లక్ష్యాలను సాధించడం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో సాధారణ దినాలు కంటే ఎక్కువ పని దినాలను కల్పించడం జరుగుతుందని పీడీ చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీలు ఉమావాణి, సుబ్రహ్మణ్యం, వరప్రసాద్, వెంకటరత్నం, శోభన్ బాబు, శ్రీనివాసులు, సునీల్ కుమార్, భాగ్యలక్ష్మి, గంగాభవాని, చిన్న రెడ్డెప్ప, ప్రియదర్శిని, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
గడువులోపు స్పందన అర్జీలను పరిష్కరించాలి
ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని.. క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యం తగదని.. సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా జిల్లాలో స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రీ ఓపెన్ కాకూడదని.. అలా జరిగితే సంబంధిత అధికారులు భాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వారం రోజుల లోపల పరిష్కారం కావాల్సి ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కారం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ఎస్‌డీసీ సర్వేను అధికారులు పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్. రాజశేఖర్, జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










