అనంతపురం: ప్రజా ప్రయోజన సేవల కోసం శాశ్వత లోక్‌అదాలత్‌లో తప్పనిసరిగా పరిష్కారం అందిస్తుందని ప్రజా ప్రయోజన సేవల శాశ్వత లోక్‌అదాలత్ ఛైర్మన్ కె.శ్రీనివాస రావు పేర్కొన్నారు. మంగళవారం శ్రీ విజయనగర న్యాయ కళాశాల ఆడిటోరియంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవేంద్రచార్ అధ్యక్షతన శాశ్వత లోక్‌అదాలత్ సేవలపై సదస్సు నిర్వహించారు. అనంతపురం, సత్యసాయి ఉమ్మడి జిల్లాల ప్రజా ప్రయోజనాల శాశ్వత లోక్‌అదాలత్ ధర్మాసనం అధ్యక్షులు న్యాయమూర్తి కె.శ్రీనివాస రావు, సభ్యులు ఎంవిఎల్‌ఎన్.శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. న్యాయ సేవ అధికార చట్టంలోని సెక్షన్ 22బి కింద శాశ్వత లోక్ అదాలత్‌లు దేశవ్యాప్తంగా ఏర్పడ్డాయని చెప్పారు. ప్రజా ప్రయోజనాల శాశ్వత లోక్ అదాలత్‌లో ఫిర్యాదు దాఖలు చేయటానికి ఎటువంటి కోర్టు ఫీజు, రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇరుపక్షాల నడుమ సామరస్య పరిష్కారానికి అవకాశం కల్పిస్తూ, సామరస్య పరిష్కారానికి సహకరించని పక్షంలో అందుబాటులో ఉన్న ఆధారాల మూలంగా కేసుల్లో తీర్పు వెలువరించగల అధికారం ఉందన్నారు. అప్పీలుకు ఆస్కారం లేని శాశ్వత పరిష్కారంగా ఈ తీర్పు ఉంటుందని తెలిపారు. న్యాయ విద్యార్థులు శాశ్వత లోక్‌అదాలత్‌పై అవగాహన కలిగి న్యాయ సేవల విస్తరణలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యవర్తిత్వ కేంద్రం సభ్యుడు హరికష్ణ, న్యాయవాదులు సత్యనారాయణ రెడ్డి, ఓబుల రాజు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం.మహేష్ పాల్గొన్నారు.










